గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కాంట్రావర్సీ స్టేట్ మెంట్స్ కు కేరాఫ్ అడ్రస్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. పార్టీలో సీనియర్ నేతగా పేరు తెచ్చుకున్న రాజాసింగ్.. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా సస్పెన్షన్ వేటు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ లో మునావార్ ఫారూక్ షో ఏర్పాటు చేసిన నేపథ్యంలో… ఓ వర్గాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ ఘాటుగా స్పందించారు. అప్పటికే బీజేపీ జాతీయ నేత నుపూర్ శర్మ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆమె స్టేట్ మెంట్స్ కు తోడుగా రాజాసింగ్ మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.
ముస్లీం జనాభా అధికంగా ఉన్న దేశాల నుంచి అభ్యంతరాలు రావడంతో నుపూర్ శర్మ పై బీజేపీ హైకమాండ్ వేటు వేయక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. అందరికీ ఒకే రూల్ అంటూ రాజాసింగ్ పార్టీ లైన్ దాటారని.. సస్పెండ్ ఎందుకు చేయవద్దో చెప్పాలని బీజేపీ హైకమాండ్ నోటీసులు జారీ చేసింది. రాజాసింగ్ సతీమణి అప్పట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను కలిశారు. నేరుగా కేంద్ర పార్టీ నాయకత్వమే రాజాసింగ్ పై వేటు వేయడంతో.. రాష్ట్ర నాయకత్వం ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ఎన్నికల షెడ్యూల్ వచ్చేసిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం గోషామహల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి నెలకొంది. నుపూర్ శర్మపై వేటు ఎత్తివేయకుండా రాజాసింగ్ ఒక్కడిపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందా ? అన్నది ఆసక్తిగా మారింది, సొంత ఎజెండాతో ముందుకు వెళతారని.. పార్టీ లైన్ దాటుతున్నారని రాజాసింగ్ పై చాలా సందర్భాల్లో విమర్శలున్నాయి. పలుమార్లు హెచ్చరించినప్పటికీ దూకుడుగా వ్యవహరించడంతో ఆయనపై వేటు వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఎన్నికల వేళ రాజాసింగ్ పై వేటు ఎత్తివేస్తే భవిష్యత్తులో మళ్లీ కామెంట్ చేయరనే గ్యారంటీ ఏంటీ ? ఒకవేళ ఏదైనా కామెంట్ చేస్తే మిగతా నాలుగు రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదు. దీంతో బీజేపీ హైకమాండ్ నాన్చివేత ధోరణిని అవలంభించే అవకాశముంది. పార్లమెంట్ ఎన్నికల ముందు ఆ ఇద్దరిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. గోషామహల్ లో బీజేపీ మరోనేతకు ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోందని తెలుస్తోంది. రాజాసింగ్ మాత్రం వేటు కొనసాగితే సైలెంట్ గా ఉండిపోతానని.. ధర్మకార్యక్రమాలు చేస్తానని చెబుతున్నారు. ఇప్పటికైతే గోషామహల్ ను వదిలేస్తే… భవిష్యత్ లో జహీరాబాద్ పార్లమెంట్ దక్కుతందనే ఆశలో ఉన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. మరి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..