Adulterated Milk: కల్తీ.. కల్తీ.. కల్తీ.. కాదేదీ కల్తీకి అనర్హం అంటూ.. ప్రతీది కల్తీ చేసేస్తున్నారు కొందరు దురాశాపరులు. పిల్లలు తాగే పాలనూ కల్తీచేస్తూ సొమ్ముచేసుకుంటున్నారు కేటుగాళ్లు. తాజాగా కల్తీ పాలను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. హైదరాబాద్ నగర శివార్లలో తనిఖీలు చేసి.. వారందరినీ అదుపులోకి తసుకున్నారు. వివరాల్లోకెళితే.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో కల్తీపాల దందాపై స్థానికుల ఫిర్యాదుతో అధికారులు తనిఖీలు చేపట్టారు. డివిజన్ వ్యాప్తంగా పాల ఉత్పత్తిదారుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. పదిమంది నుంచి పాల శాంపిళ్లను సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపారు. పాలు నిల్వ ఉంచడానికి హానికరమైన కెమికల్స్ వాడుతున్నట్లు గుర్తించారు. ల్యాబ్ నివేదిక ప్రకారం పాల ఉత్పత్తిదారులపై కేసునమోదు చేస్తామని తెలిపారు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ జ్యోతిర్మయి.
విడిపాలలో హానికర కెమికల్స్ కలిపే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు జ్యోతిర్మయి. వినియోగదారులు బ్రాండెడ్ పాలనే కొనుగోలు చేయాలని కోరారు. అనుమతిలేకుండా పాలను నిల్వ ఉంచడం నేరమేనన్నారు. పాలు విక్రయించేవారు కచ్చితంగా ఫుడ్ లైసెన్స్ కలిగి ఉండాలంటున్నారు. లేకుంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ల్యాబ్ నివేదిక వస్తే తప్ప కల్తీ ఏమేరకు జరిగిందో చెప్పలేమంటున్నారు అదికారులు.