
అడవుల జిల్లా ఆదిలాబాద్.. విలువైన ఖనిజ సంపదకు కేరాఫ్ అడ్రస్. కశ్మీర్ టూ కన్యకుమారీలకు ప్రధాన ద్వారం. జిల్లాకు రైలు మార్గం ఉన్నా.. రాష్ట్ర రాజధానికి చేరుకోవాలంటే బస్ మార్గం మాత్రమే దిక్కు. రాష్ట్రం నుండి విసిరేసినట్టుగా ఉండటంతో అభివృద్దిలోను ఈ జిల్లా ఆమడ దూరంలో నిలిచిపోయింది. మహారాష్ట్రకు కూత వేటు దూరంలోనే ఉండటంతో ఇక్కడ విమానశ్రయాన్ని ఏర్పాటు చేస్తే అభివృద్ది సాధ్యం అవుతుందని ఆనాటి పాలకులు ఆలోచించారు. స్వాతంత్ర్యానికి ముందే ఇక్కడ విమానాలు ఎగిరిన ఘన చరిత్ర కూడా ఉండటంతో ఇక్కడ విమానాశ్రయాన్ని నిర్మించాలని మొదట్లో భావించారు. నిజాం కాలంలో యుద్దవిమానాలకు ఊపిరిపోసిన చరిత్ర ఆదిలాబాద్ సొంతం కావడం.. 1930లోనే యుద్ధభూమికి వెళ్లే యుద్ధ విమానాలకు ఇంధనం నింపడానికి ఏకంగా 369 ఎకరాల భూమిలో ఒక ఏరోడ్రోమ్‌ను స్థాపించడం ఈ జిల్లా చరిత్ర సొంతం. ఇప్పుడు ఆ చరిత్రను నిజం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిలాబాద్ లో విమానశ్రయాన్ని నిర్మించాలని ముందుకు వచ్చాయి.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరోడ్రమ్ ప్రాంతంలో గతంలోనే సర్వే నిర్వహించిన 369 ఎకరాల భూమిలో చిన్న విమానాశ్రయాన్ని నిర్మించాలని అనుకున్నారు. అయితే భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో భారీ విమానాశ్రయాన్ని నిర్మించాలని ఏఏఐ నిర్ణయించడంతో.. ఓవైపు విమానాశ్రయం.. మరోవైపు భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) స్టేషన్ ను ఇక్కడ నిర్మించాలని ఫిక్స్ అయ్యారు.
1930లోనే యుద్ధభూమికి వెళ్లే యుద్ధ విమానాలకు ఇంధనం నింపడానికి ఏరోడ్రమ్ ప్రాంతాన్ని వినియోగించిన వాయు సేన.. తాజాగా తమ వైమానిక దళాలకు చెందిన విమానాల కోసం ఇక్కడ ఒక స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 1970 చివరి వరకు పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించే హెలికాప్టర్లకు ఇంధనం నింపే కేంద్రంగా ఈ ప్రాంతాన్ని వాడుకున్న వాయుసేన.. 2014లో ఏరోడ్రోమ్‌ను పూర్తి స్థాయి వైమానిక దళ స్టేషన్‌గా మార్చాలని IAF ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో పౌర విమానాలకు సైతం అవకాశం ఇవ్వాలన్న ఒప్పందంతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఆదిలాబాద్‌లో పౌర విమానాలు, ఎయిర్ఫోర్స్ విమానాలకు కామన్ రన్వే నిర్మించాలని కేంద్రం డిసైడ్ అయింది.
ఎయిర్బస్ ఏ-320, బోయింగ్-737 రకం విమానాల రాకపోకలకు వీలుగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆమోదం తెలిపింది. ఉదయం వేళల్లోనే కాకుండా రాత్రివేళల్లోనూ విమానాల ల్యాండింగ్, టేకాఫ్లు జరిగేలా వసతుల కల్పనకు కూడా సమ్మతించింది ఏఏఐ. ఈ నిర్ణయంతో ఏడు దశాబ్దాల కల పట్టాలెక్కినట్టైంది.
ఆదిలాబాద్ పట్టణ శివారులోని శాంతి నగర్ లో నిజాంకాలం నాటి ఎయిర్ స్టాప్ ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న 369 ఎకరాలకు అదనంగా మరో 300 ఎకరాల స్థలాన్ని సేకరించాలని నిర్ణయించారు. తాజాగా అన్ని అడ్డంకులు తీరిపోవడంతో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు. వచ్చే 30 ఏళ్ల అవసరాలు తీర్చేలా ఇక్కడ నైట్ ల్యాండింగ్ లతో కూడిన పెద్ద విమానాశ్రయాన్నే నిర్మించనున్నారు. కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్న ఏఏఐ తాజాగా ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆదిలాబాద్లో ఎయిర్బస్ -380, బోయింగ్-777 విమానాలు (అతిపెద్ద విమానాలు) దిగే సామర్థ్యంతో కూడిన రన్వే అవసరమా లేక ఎయిర్బస్-ఏ320, బోయింగ్-737 రకం విమానాలు దిగే సామర్థ్యంతో కూడిన రన్వే కావాలా అని ప్రశ్నించింది.
ఎయిర్బస్-ఏ320, బోయింగ్-737 స్థాయి విమానాలు దిగే రన్వే సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో 2 కి. మీ. నుంచి 3 కి.మీ. పొడవైన రన్వే నిర్మాణానికి నిర్ణయించింది ఏఏఐ. ఓ వైపు ప్రయాణికుల విమానాలు నిలిచే స్థలం, ప్రయాణికుల ప్రాంగణం మరోవైపు ఎయిర్ఫోర్స్ స్టేషన్ నిర్మాణం కానుంది. వాయుసేనకు దాదాపు 50-80 ఎకరాల స్థలం కేటాయించి మిగతా మొత్తాన్ని ప్రయాణికుల విమానాశ్రయానికి వినియోగించనున్నారు.
విమానాశ్రయం ఏర్పాటుకోసం ఇప్పటికే ఆదిలాబాద్ శివారులో 369 ఎకరాలు విమానాశ్రయ భూములు ఉన్నాయి. వీటితో పాటు ఎయిర్ స్ట్రిప్ నిర్మాణానికి ఆదిలాబాద్ శివారులోని ఖానాపూర్‌లో 481.16 ఎకరాల పట్టా భూములు, 50 ఎకరాల అసైన్డ్ భూములు, అనుకుంటలో 535.38 ఎకరాల పట్టా భూములు, 34.04 ఎకరాల అసైన్డ్ భూములు, తంతోలిలో 261.27 ఎకరాల పట్టా భూములు, 5.02 ఎకరాల అసైన్డ్ భూములు కేటాయించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. మొత్తంగా 1590 ఎకరాల్లో విమానశ్రయాన్ని నిర్మాణం చేయాలని అధికారులు 2019 లోనే కేంద్రానికి రిపోర్ట్ పంపించారు. విద్యుత్, నీరు, రోడ్లు, భవనాల కోసం 40 కోట్ల నిధులు అవసరమవుతాయని అదికారులు అంచనా వేశారు. 2019 కి ముందు నుండే ఈ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం కు అనుమతులు నిలిపేశారు. ఎయిర్‌ఫోర్స్ విభాగం అధికారులు కూడా ఇప్పటికే 12 సార్లు పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఏఏఐ భారీ విమానశ్రయ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆదిలాబాద్ వాసుల ఆనందం అంబరాన్ని అంటుతోంది.
ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటైతే ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.. అంతర్జాతీయ స్థాయిలో ఈ మూడు జిల్లాలకు గుర్తింపు వస్తుంది.. ఉత్తర భారతంతో తెలంగాణకు రాకపోకలు పెరిగి వ్యాపారంతో పాటు ఉన్నతాధికారులు, జాతీయ నాయకుల తాకిడి పెరుగుతుంది. ఈ భారీ విమానాశ్రయ నిర్మాణం పట్టాలెక్కితే అడవుల జిల్లా ఖ్యాతి ఖండాంతరాలు దాటడం ఖాయం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.