ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు.. పెరగనున్న భూముల ధరలు!

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రతిపాదిత ఎయిర్‌ఫీల్డ్‌ ఏర్పాటుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలివిడతగా 160.32 ఎకరాల భూమికి రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 2,069 ఎకరాలను సేకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరింత భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనుంది.

ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు.. పెరగనున్న భూముల ధరలు!
Adilabad Airfield Project

Edited By:

Updated on: Aug 25, 2026 | 5:25 PM

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రతిపాదిత ఎయిర్‌ఫీల్డ్‌ ఏర్పాటుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. భూసేకరణలో భాగంగా తొలివిడతగా 160.32 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించేందుకు రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో అర్లి-బి పరిధిలో 58 మంది రైతులకు చెందిన భూములు ఉన్నాయి. కచ్‌కంటి, టాక్లి ప్రాంతాల్లోనూ మరికొంత భూమి సేకరణకు నోటిఫికేషన్‌ సిద్ధమవుతోంది. కచ్‌కంటి పరిధిలో 29.19 ఎకరాలు, టాక్లి శివారులో మరో 5.20 ఎకరాల భూమికి త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ఆర్డీవో జగదీశ్వర్‌రావు తెలిపారు.

భూములపై లావాదేవీలు వద్దు

అయితే ఈ నోటిఫికేషన్‌ వెలువడిన తేదీ నుంచి 60 రోజుల్లో అభ్యంతరాలను రాతపూర్వకంగా తెలియజేయాలని రైతులకు సూచించారు. త్వరలో గ్రామసభలు నిర్వహించి పరిహారం అంశంపై అభిప్రాయాలను సేకరిస్తామని చెప్పారు. అలాగే నోటిఫికేషన్‌లో పొందుపర్చిన భూములకు సంబంధించి కలెక్టర్‌ అనుమతి లేకుండా ఎలాంటి క్రయవిక్రయాలు, అభివృద్ధి పనులు, తాకట్టు వంటి లావాదేవీలు చేపట్టవద్దని అధికారులు స్పష్టం చేశారు. భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఆసక్తి, ఆందోళన రెండూ కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరోవైపు.. అనుకుంట, ఖానాపూర్‌ గ్రామ శివారులో ఇంకా సర్వే పూర్తి చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. తొలుత మూతపడిన సీసీఐ భూములను ఎయిర్‌ఫీల్డ్‌ కోసం సేకరిస్తారనే ప్రచారం జరిగినా.. ప్రస్తుతం వాటి జోలికి వెళ్లడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో సీసీఐ పరిశ్రమ భవిష్యత్‌లో తిరిగి తెరుచుకునే అవకాశాలపై ఆశలు సజీవంగానే ఉన్నాయనే చర్చ మొదలైంది.

ఇదిలా ఉండగా.. ఆదిలాబాద్‌ పట్టణం నుంచి అనుకుంట మీదుగా వెళ్లే ప్రధాన రహదారిని కచ్‌కంటి వైపు మళ్లించనున్నారనే ప్రచారం ఆయా గ్రామాల్లో కలవరానికి కారణమవుతోంది. బెంగళూరు నుంచి వచ్చిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ సర్వీసు విభాగ బృందం ఏరియల్‌ సర్వే నిర్వహించడం, అదే సమయంలో భూసేకరణ ప్రక్రియ వేగం పుంజుకోవడంతో ప్రతిపాదిత ఎయిర్‌ఫీల్డ్‌పై జిల్లా ప్రజల్లో ఆసక్తి మరింత పెరిగింది.

30 గ్రామాలకు కొత్త బైపాస్‌

ఎయిర్‌ఫీల్డ్‌ నిర్మాణంలో భాగంగా అనుకుంట ప్రధాన రహదారి కూడా ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే దాదాపు 30 గ్రామాలకు జిల్లా కేంద్రంతో ఉన్న ప్రస్తుత కనెక్టివిటీకి అంతరాయం కలగనుంది. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా కచ్‌కంటి మీదుగా కొత్త బైపాస్‌ రహదారిని నిర్మించేందుకు సిద్ధమవుతోంది. 66 అడుగుల వెడల్పుతో నిర్మించనున్న ఈ కొత్త రహదారి కోసం ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బంగారుగూడ–కచ్‌కంటి మీదుగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి సులభంగా చేరుకునేలా ఈ మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు.

ప్రస్తుతం శ్రీరాంకాలనీ, కుమ్మరివాడ, విమానాశ్రయ స్థలానికి ఆనుకుని ఉన్న ప్రాంతం, ఇందిరమ్మ కాలనీ మీదుగా కచ్‌కంటికి రాకపోకలు సాగుతున్నాయి. ఎయిర్‌ఫీల్డ్‌ నిర్మాణంతో ఈ మార్గం మూసివేసే పరిస్థితి వస్తే.. కచ్‌కంటి నుంచి బంగారుగూడ ప్రధాన రహదారిని అనుసంధానించే కొత్త బైపాస్‌ కీలకం కానుంది. ఇందుకోసం కచ్‌కంటి సమీపంలో అవసరమైన భూసేకరణ కూడా చేపట్టనున్నారు.

యాపల్‌గూడ, రాముల్‌గూడ, కొత్తగూడ, యశ్వంత్‌గూడ, మత్తడిగూడ, బూర్నూర్, అడ్డగుట్ట, శివఘాట్, కుంభఝరి, టాక్లి గ్రామాలతో పాటు సాత్నాల మండలంలోని రామాయి, జాముల్‌ధరి, న్యూరాంపూర్, సాత్నాల, సుందరగిరి, మాంగూర్ల, కాన్పమేడిగూడ, మేడిగూడ, జామ్ని, మారుగూడ, తోయగూడ, సైద్‌పూర్, సహేజ్, సాంగ్వి, జామ్డ గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి ఈ మార్గంపైనే ఆధారపడుతున్నారు.

గాదిగూడ మండలంలోని పరస్వాడ, లోకారి, గాదిగూడ గ్రామాల ప్రజలు కూడా ఇదే దారిని వినియోగిస్తున్నారు. ఆదిలాబాద్‌ అర్బన్‌ పరిధిలోని బంగారుగూడ, అనుకుంట గ్రామాల ప్రజలకు కూడా ఈ రహదారి అత్యంత కీలకం. నార్నూర్, గాదిగూడ మండలాల్లోని మరికొన్ని గ్రామాల ప్రజలు సైతం జిల్లా కేంద్రానికి రావడానికి ఇదే మార్గాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో.. నిత్యం ఆటోలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు, ద్విచక్ర వాహనాలతో రహదారి రద్దీగా ఉంటుంది.

అభివృద్ధికి ఎయిర్‌ఫీల్డ్‌.. ప్రజలకు కొత్త రహదారి

విమానాశ్రయం నిర్మాణం కోసం అనుకుంట ప్రాంతంలోని వ్యవసాయ భూములు సేకరణకు వస్తుండటంతో ఖానాపూర్‌ సమీపంలోని అనుకుంట మలుపు నుంచి అనుకుంట గ్రామం వరకు ఉన్న ప్రస్తుత రహదారి కూడా ఎయిర్‌ఫీల్డ్‌ పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కొత్త బైపాస్‌పై దృష్టి పెట్టింది.

ఒకవైపు ఎయిర్‌ఫీల్డ్‌ కోసం వేల ఎకరాల భూసేకరణ.. మరోవైపు ప్రభావిత గ్రామాలకు ప్రత్యామ్నాయ రహదారి.. ఇంకోవైపు ఏరియల్‌ సర్వే.. ఇవన్నీ కలిసి ఆదిలాబాద్‌ ఎయిర్‌ఫీల్డ్‌ ప్రతిపాదనకు కదలిక వచ్చిన సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఎయిర్‌ఫీల్డ్‌ అందుబాటులోకి వస్తే విమాన రాకపోకలతో పాటు పెట్టుబడులు, వ్యాపారం, ఉపాధి అవకాశాలు పెరిగి జిల్లా కేంద్రం అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us