Adani to Telangana: తెలంగాణ స్కిల్‌ వర్సిటీకి అదానీ ఫౌండేషన్‌ భారీ విరాళం.. ఎంతో తెలుసా..?

|

Oct 19, 2024 | 7:50 AM

నవంబర్‌ 4వ తేదీ నుంచి స్కిల్ యూనివర్శిటీలో కోర్సులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ప్రాధాన్యం ఉన్న ఆరు కోర్సులతో మొదలు పెట్టి.. క్రమంగా మరిన్ని కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

Adani to Telangana: తెలంగాణ స్కిల్‌ వర్సిటీకి అదానీ ఫౌండేషన్‌ భారీ విరాళం.. ఎంతో తెలుసా..?
Gautham Adani Cm Revanth Reddy
Follow us on

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠా్త్మకంగా ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్శిటీకి అదానీ గ్రూప్‌ ఫౌండేషన్‌ భారీ విరాళం ప్రకటించింది. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి 100కోట్ల చెక్కు అందజేశారు అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ.

తెలంగాణ యువతకు వివిధ రంగాల్లో స్కిల్స్‌ నేర్పించేందుకు రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలోని బేగరికంచెలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్కిల్ యూనివర్శిటీ నెలకొల్పింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఈ వర్శిటీకి శంకుస్థాపన చేశారు. దీని ద్వారా యువతకు ట్రైనింగ్‌ ఇచ్చి ప్రైవేట్‌ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఏటా లక్ష మందికి శిక్షణ ఇచ్చేలా రాబోయే కాలంలో ఈ యూరివర్శిటీని విస్తరించనున్నారు అధికారులు.

అయితే.. ప్రస్తుతం బేగరికంచెలోని గవర్నమెంట్‌ బిల్డింగ్‌ పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్‌ స్టాప్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా భవనంలో వర్శిటీలో కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ ఏడాది నుంచి ప్రవేశాలు కల్పించేలా ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నవంబర్‌ 4వ తేదీ నుంచి స్కిల్ యూనివర్శిటీలో కోర్సులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ప్రాధాన్యం ఉన్న ఆరు కోర్సులతో మొదలు పెట్టి.. క్రమంగా మరిన్ని కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ యూనివర్శిటీకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలోనే.. తాజాగా.. సీఎం రేవంత్‌రెడ్డిని అదానీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం కలిసింది. తెలంగాణలో ఏర్పాటు చేసిన స్కిల్‌ యూనివర్శిటీకి అదానీ గ్రూప్‌ ఫౌండేషన్‌ నుంచి 100కోట్లు విరాళం ప్రకటించి.. దానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ భేటీలో అదానీ గ్రూప్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. భారీ విరాళం అందజేసిన అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..