
కుక్క.. విశ్వాసానికి మారుపేరు. ఒక్కసారి దాని కడుపు నింపితే.. చచ్చేదాకా అది ఎంతో విశ్వాసంగా ఉంటుందంటారు. కుక్కల విశ్వాసాన్ని నిరూపించే ఎన్నో ఘటనలను ఇటీవల మనం వినే ఉంటాం. మనం పెంచుకునే కుక్క, ఊర్లో ఎక్కడెక్కడో తిరిగినా చివరికి ఇంటికి వస్తుంది. కుక్కలు వాసనలు పసిగట్టి, తమ గమ్య స్థానాలకు చేరుతాయి. కానీ..కొన్ని కిలోమీటర్ల బయట శూనకాలను విడిచిపెడితే మళ్ళీ ఆ ప్రాంతానికి రావడం సాధ్యమవుతుందంటే కష్టమనే చెప్పాలి. కానీ ఓ శూనకం మాత్రం అది పెద్ద కష్టమేమి కాదని యాజమాని ఇంటికి చేరుకుంది. తాజాగా ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన పున్నం మల్లయ్య 6 సంవత్సరాల కింద తన ఇంటి వెనకాల అప్పుడే జన్మించిన ఒంటరిగా ఉన్నా కుక్క పిల్లను చూశాడు. తల్లి లేకపోవడంతో దానికి రోజు పాలు, ఆహరం ఇచ్చేవాడు. అలా ఆ కుక్క వారికీ చాలా దగ్గరైంది. ఇంట్లో ఓ వ్యక్తిలా కలిసిపోయింది. రోజు మూడు పూటల భోజనం పెడుతుండేవారు. ఒకవేళ వారు పనిపైన ఊరికి వెళ్తే, పక్కింటి వారికి చెప్పి దాని బాగోగులు చూసుకునే వారు. అలా ఆ కుక్క పెరిగి పెద్దదైంది. ఆ యజమాని ఎక్కడికి వెళ్లిన వెంటే వెళ్లి పని పూర్తి కాగానే ఆయనతో పాటు వచ్చేది. వారేదైనా ఊరికి వెళ్తే, తిరిగి వచ్చేవరకు దిగులుగా కూర్చునేది. ఇంటికి ఎవరు రాకుండా కాపలా కాస్తుండేంది.
అయితే ఇటీవల వారింటికి వస్తున్నా వారిపై ఆ శునకం దాడి చేసింది. ఆ శునకం వల్ల ఇబ్బంది పడుతున్నామని, దాన్ని సుదూర ప్రాంతంలో విడిచిపెట్టి రావాలని వీధిలో ఉన్నావారు మల్లయ్యకు తెలిపారు. దీంతో ఆ శునకాన్ని ఇంటి నుండి బయటకు తీసుకెళ్లారు. అయితే బైక్ పైన వెళ్తే, ఆ మార్గాన్ని చూసి మళ్ళీ ఇంటికి వస్తదేమోనని కారులో కుక్కను ఎక్కించి, రోడ్డు కనిపించకుండా కిటికీ అద్దాలు మూసేశారు. వారి ఊరి నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఓ అడవి ప్రాంతంలో కారు డోర్ తీసి దాన్ని విడిచిపెట్టారు. ఆ సందర్భంలో ఆ యజమాని కుక్కను నిమురుతూ కంటతడి పెట్టారు. శునకాన్ని విడిచిపెట్టడం వారికి ఇష్టం లేకపోయినా, బలవంతంగా దాన్ని కారులో నుండి దింపేశారు. కారులో నుండి దింపగానే యజమాని కూడా దిగుతాడని అనుకున్నది ఆ శునకం.. కానీ నన్ను విడిచి వెళ్తున్నారని అసలు ఊహించి ఉండదు. కారు కాస్తా.. ముందుకు వెళ్ళగానే బిత్తర చూపులు చూసి, కాసేపటి తర్వాత పక్కనే ఉన్నా చెట్ల పొదల్లోకి వెళ్ళిపోయింది. కుక్కను వదిలేశామనే బాధలో వారు ఇంటికి తిరిగి వచ్చేశారు.
అయితే వారు శునకాన్ని విడిచి పెట్టిన తర్వాత సరిగ్గా ఐదు రోజులకు, ఆ యజమాని ఇంటికి తిరిగి చేరుకుంది ఆ శునకం. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. 70 కిలోమీటర్ల బయట, రోడ్డు కనిపించకుండా అది కూడా ఓ అటవీ ప్రాంతంలో విడిచి పెట్టిన శునకం మళ్ళీ ఆ ఇంటిని చేరుకుంది. ఆ యజమాని కుటుంబం పై ప్రేమతో ఆ శునకం ఇళ్లు చేరిందని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం శునకాలకు మనుషులకంటే ఎక్కువ జ్ఞాపకశక్తి ఉంటుందని, దానివల్లే అది మళ్ళీ ఆ గమ్య స్థానానికి వచ్చిందంటున్నారు. ఏది ఏమైనా తమ యజమాని దగ్గరికి వెళ్ళడానికి ఆ శునకం 5 రోజులు ప్రయాణం చేసి ఇంటికి చేరుకుంది. ఇష్టం లేకున్నా శునకాన్ని వదిలిపెట్టమనే బాధలో ఉన్నా సమయంలో శునకం వారింటికి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు యజమాని మల్లయ్య.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..