జగిత్యాల కాంగ్రెస్ లో విబేధాలు మరింత ముదిరిపోయాయి. నిన్నటి వరకు అంతర్గతంగా జరిగే గ్రూపు తగాదాలు ఇప్పుడు రోడ్డుమీద పడ్డాయి. కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య నేపధ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ల మధ్య మరింత గ్యాప్ ఏర్పడింది. అంతేకాకుండా ఈ హత్యకు రాజకీయాల కుట్ర కు సంబంధం ఉందంటూ జీవన్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. అయితే జీవన్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు సంజయ్ కుమార్.
జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు ఇద్దరూ నేతలు ప్రత్యర్థులు. నాలుగు నెలల క్రితం సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక, అప్పటి నుండి అధిష్టానం తీరుపైనా జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. ఐదు రోజుల క్రితం జాబితా పూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గంగారెడ్డి దారుణ హత్యకు గురి అయ్యారు. ఫిరాయింపు ల కారణంగానే ఈ హత్య జరిగిందంటూ జీవన్ రెడ్డి అరోపించారు. గతంలో బీఅర్ఎస్‌లో ఉన్న నేతలే ఇప్పుడు కాంగ్రెస్ నేతలుగా మారారని విమర్శలు చేశారు జీవన్ రెడ్డి. అంతేకాకుండా ఈ హత్యకు పరోక్షంగా ఎమ్మెల్యే హస్తం ఉందనే జీవన్ రెడ్డి అనుచరులు అరోపించారు.
ఇదిలావుంటే, పార్టీ ఫిరాయింపుల పైనా అధిష్టానానికి లేఖ రాశారు జీవన్ రెడ్డి. ఫిరాయింపుల రాజకీయాన్ని ఒప్పుకునేది లేదంటూ ఖరాఖండీగా చెబుతున్నారు. అయితే సంజయ్ కూడా జీవన్ రెడ్డికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఎవరిది గాంధేయ కుటుంబమో, ఎవరు హత్యలు చేసే కుటుంబమో జగిత్యాల ప్రజలందరికీ తెలుసునని గుర్తు చేస్తున్నారు. ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హత జీవన్ రెడ్డికి లేదని విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని బదనం చేయకుండా జగిత్యాల ప్రజలకి ఏం చేయాలో అలోచించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే జగిత్యాలలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలి పోయింది. కొంతమంది జీవన్ రెడ్డి వర్గంలో ఉండగా, మరికొంత మంది సంజయ్ కుమార్ వర్గం గా ఉంటున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో జగిత్యాల కాంగ్రెస్ లో విభేదాలు సద్దుమణిగే అవకాశాలు కనబడడం లేదు.
జగిత్యాలలో స్వపక్ష నేతకే ప్రత్యర్థులుగా మారిపోయారు. ఈ ఇద్దరూ నేతలు జగిత్యాలలో పట్టు సాధించేందుకు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. నామినేట్ పోస్టులలో తమ వర్గం వారికే అవకాశం కోసం పావులు కదిపారు. మొన్నటివరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు అన్ని ఇప్పుడు రోడ్డుమీద పడేశాయి. అధిష్టానం జీవన్ రెడ్డి కి నచ్చజెప్పిన వెనకకి తగ్గడం లేదు. జగిత్యాల రాజకీయాలు కూడా అధిష్టానానికి తలనొప్పి గా మారిపోయాయి. ఈ నేతల విభేదాలు ఏ స్థాయి వరకు వెళ్తాయో వేచి చూడాల్సిందే..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..