
బాలికల భద్రతకు న్యాయవ్యవస్థ కఠినమైన హెచ్చరికగా నిలిచే తీర్పును నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మైనర్ బాలికను మభ్యపెట్టి బలవంతంగా వివాహం చేసుకున్న నిందితుడికి 32 ఏళ్ళ జైలు శిక్షను విధించింది.
నల్లగొండ పట్టణం పానగల్ కు చెందిన గురజల చందు అనే యువకుడు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. నార్కెట్ పల్లి మండలానికి చెందిన మైనర్ బాలికతో చందు పరిచయం పెంచుకున్నాడు. తరచూ బాలికతో ఫోన్ లో మాట్లాడే చందు 19 సెప్టెంబర్ 2022న మాయ మాటలు చెప్పి ఎత్తుకెళ్లాడు. దీంతో బాలిక బంధువులు నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చందు పై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. తనపై కిడ్నాప్ కేస్ పెట్టిన విషయాన్ని తెలుసుకున్న చందు 20 సెప్టెంబర్ 2022న బాలికను నల్లగొండలో వదిలి పరారయ్యాడు. బాధిత బాలికను పోలీసులు భరోసా కేంద్రానికి తరలించారు. తనను మభ్యపెట్టి గుడికి తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడని, పానగల్ లోని తన కుటుంబ సభ్యులకు వద్దకు తీసుకువెళ్లి భార్యాభర్తల అని చెప్పి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత బాలిక పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు చందుపై కిడ్నాప్ కేస్ తో పాటు పోక్సో కేసును కూడా నమోదు చేశారు.
పూర్తి సాక్ష్యాధారాలు, సైంటిఫిక్ ఎవిడెన్స్, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు పోక్సో కోర్టులో 15 నవంబర్ 2022న ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడికి 32 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా ఫోక్సొ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి 75 వేల రూపాయల జరిమానా విధించడంతోపాటు బాధితురాలికి 10 లక్షల రూపాయల పరిహారం, ఇవ్వాలని పోక్సో కోర్టు జడ్జి రోజారమణి తీర్పు ఇచ్చింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..