Telangana: తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..

పంచాయతీ ఎన్నికల్లో 91 ఏళ్ల రాయల వెంకటేశ్వర్లు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ముదిగొండ మండలం వెంకటాపురంలో ప్రజల ప్రోత్సాహంతో, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఆయన బరిలో దిగారు. 30 ఏళ్లపాటు ఉప సర్పంచ్‌గా సేవలు అందించిన వెంకటేశ్వర్లు, వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తున్నారు.

Telangana: తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
91 Year Old Sarpanch Candidate

Edited By: Krishna S

Updated on: Dec 07, 2025 | 10:57 AM

సాధారణంగా సర్పంచ్ ఎన్నికల్లో యువతరం ఉత్సాహం చూపిస్తుంటారు. కానీ వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తూ 91 ఏళ్ల కృరవృద్ధుడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రాయల వెంకటేశ్వర్లు అనే వృద్ధుడు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. రాయల వెంకటేశ్వర్లు తన రాజకీయ జీవితం గురించి వివరిస్తూ.. ఎన్నికల్లో పోటీకి వయసు అడ్డుకాదని స్పష్టం చేశారు. 1959లో పంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ముదిగొండ వెంకటాపురం ఉమ్మడి పంచాయతీగా ఉన్నప్పుడు, తన 22 ఏళ్ల వయసు నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు.

ఉమ్మడి ముదిగొండ గ్రామపంచాయతీ నుంచి వెంకటాపురం గ్రామపంచాయతీగా విడిపోయేంతవరకు ఆయన సుమారు 30 సంవత్సరాలుగా ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ కాలంలో గ్రామంలో ప్రజలకు అనేక సేవలు అందించానని తెలిపారు. ప్రస్తుతం 91 ఏళ్ల వయసులో కూడా ఆయన పోటీ చేయడానికి ప్రధాన కారణం గ్రామస్తుల ప్రోత్సాహమేనని వెంకటేశ్వర్లు తెలిపారు. ‘‘తమ గ్రామం మరింత అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. అందుకే ప్రజల కోరిక మేరకే, వారి మమకారంతో నేను సర్పంచ్‌ బరిలో నిలిచాను. కేవలం ప్రజల కోసమే ఈ వయసులో కూడా పోటీలో ఉంటున్నాను’’ అని వెంకటేశ్వర్లు తెలిపారు.

పార్టీల మద్దతు

రాయల వెంకటేశ్వర్లు సీపీఎం పార్టీ నుంచి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తనకు టీఆర్‌ఎస్, టీడీపీ పార్టీల మద్దతు కూడా లభించిందని ఆయన తెలిపారు. అన్ని పార్టీల మద్దతుతో ఈ ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలుస్తానని రాయల వెంకటేశ్వర్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి