
కన్నప్రేమ కరువైంది..కంటికి రెప్పలా పెంచిన చేతులే కన్నీరు పెడుతున్నాయి..ఎనిమిది మంది కొడుకులు..ఐదుగురు కూతుర్లు.. అందరికీ రెక్కలు ముక్కలు చేసుకుని పెళ్లిళ్లు చేశాడు ఆ తండ్రి.ఒక ఇల్లు, మూడు ఎకరాల భూమి సంపాదించి ఇచ్చాడు. కానీ, ఈరోజు ఆ వృద్ధ తండ్రికి బుక్కెడు అన్నం పెట్టే నాథుడే కరువయ్యాడు..నా కొడుకులకు చెప్పి నాకు అన్నం పెట్టించండి సార్.. మీ కాళ్లు మొక్కుతా అంటూ ఆ వృద్ధుడు ప్రజావాణిలో అధికారుల ముందు బోరున విలపించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది..పూర్తి వివరాల్లోకి వెళ్తే
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాపేట గ్రామానికి చెందిన ఎంబీ మహబూబ్ కథ ఇది. ఒకప్పుడు అందరిలాగే పచ్చని సంసారం..ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుర్లతో కళకళలాడిన ఇల్లు. తనకున్న కొద్దిపాటి ఆస్తి, గేదెలను అమ్మి వచ్చిన డబ్బును కూడా కొడుకులకే ఇచ్చాడు. పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి బాధ్యత తీర్చుకున్నాడు..కానీ, ఆరేళ్ల క్రితం భార్య మరణించడంతో మహబూబ్ జీవితం ఒక్కసారిగా తలకిందులుగా అయ్యింది..అయితే ఎనిమిది మంది కొడుకుల్లో ఏడుగురు హైదరాబాద్‌లో స్థిరపడగా,పెద్ద కొడుకు ఊర్లోనే ఉంటున్నాడు. అయినా గత ఏడాది కాలంగా ఈ వృద్ధుడికి కనీసం అన్నం పెట్టే దిక్కు లేకుండా పోయింది..
ఆకలి తట్టుకోలేక ఎండావానా అని తేడా లేకుండా ఊళ్లో ఇంటింటికీ తిరుగుతూ భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుంటున్నాడు. కూలిపోయిన తన పాత ఇంట్లో ఒక పక్కన పడుకుంటూ నరకయాతన అనుభవి స్తున్నాడు…వయసు పై బడటంతో భిక్షాటన చేసే ఓపిక కూడా లేక..నాకు బుక్కెడు అన్నం పెట్టండి అని కొడుకులకు ఫోన్ చేసి వేడుకున్నా ఆ పాషాణ హృదయులు కరగలేదు. దీంతో వారం రోజుల క్రితం చేసేదేమీ లేక మహబూబ్ పోలీసులను ఆశ్రయించాడు..పోలీసులు కొడుకులకు సమాచారం ఇచ్చినా ఎవరూ రాలేదు. కొడుకులు వస్తారేమో, తనను తీసుకెళ్తారేమో అన్న ఆశతో ఆ వృద్ధుడు ఏకంగా మూడు రోజుల పాటు రాత్రింబవళ్లు పోలీస్ స్టేషన్‌లోనే పడుకుని ఎదురుచూశాడు..చివరకు పోలీసులు స్థానిక సర్పంచ్ అశోక్ రెడ్డికి సమాచారం అందించడంతో, ఆయన వచ్చి వృద్ధుడిని గ్రామానికి తీసుకెళ్లారు.
కొడుకులు రాకపోవడంతో సోమవారం నాడు ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చేందుకు మహబూబ్ ఎంపీడీవో వెంకటలక్ష్మి వద్దకు వచ్చాడు..అధికారుల కాళ్లు మొక్కుతూ..మేడం.. నాకు బుక్కెడు అన్నం పెట్టమని నా కొడుకులకు చెప్పండి అంటూ బోరున ఏడ్చాడు..నా భార్య బతికుంటే నాకు ఈ గతి పట్టేది కాదు అంటూ భార్యను తలుచుకుని విలపించిన తీరు ప్రజావాణికి వచ్చిన వారందరినీ కంటతడి పెట్టించింది. ఫిర్యాదు ఇచ్చి ఏడుస్తూనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ అభాగ్యుడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి