
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఏడుగురు విదేశీయులను జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరించారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఓ అద్దె ఇంట్లో విదేశీయులు నివసిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి పత్రాలను పరిశీలించగా, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టులు, వీసాలు లేదా భారత్‌లో నివసించేందుకు అవసరమైన ఇతర అనుమతి పత్రాలు కూడా చూపించలేకపోయినట్లు అధికారులు తెలిపారు.
ప్రాథమిక విచారణలో వీరంతా అక్రమ మార్గంలో భారత్‌లోకి ప్రవేశించి ఇక్కడ నివసిస్తున్నారని పోలీసులు గుర్తించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొంతకాలం గడిపిన అనంతరం హైదరాబాద్‌కు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. వీరు ఏ మార్గం ద్వారా దేశంలోకి ప్రవేశించారు, స్థానికంగా ఎవరి సహకారం పొందారు అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఏడుగురిని మెదక్ జిల్లా జోగిపేటలోని విదేశీయుల నిర్బంధ కేంద్రానికి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బంగ్లాదేశ్‌కు పంపించేందుకు అవసరమైన న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో కూకట్‌పల్లి జోన్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్‌ఓటీ) సిబ్బంది జీడిమెట్ల పోలీసులకు సహకరించారు. అక్రమంగా నివాసం ఏర్పాటుకు ఎవరైనా స్థానికంగా సహకరించారా అనే అంశంపై కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.