
ఉమ్మడి వరంగల్ జిల్లాను వానలు, వరదలు అతలాకుతలం చేశాయి. నాలుగు రోజులపాటు జనజీవనం విలవిలలాడింది. వరదలు పోటెత్తి 23 మంది జల సమాధి అయ్యారు. ఇప్పటివరకు 19మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారికోసం డ్రోన్ కెమెరాలతో గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి. వరదలు ముంచెత్తిన దిగువ ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఇప్పటివరకు లభ్యమైన మృతదేహాల్లో ఏటూరునాగారం మండలంలోని కొండాయి – మల్యాల గ్రామాలకు చెందిన ఎనిమిది మంది ఉన్నారు. ఈ జిల్లాలో మొత్తం 11 మంది మృతి చెందగా ఇప్పటి వరకు 9 మృతదేహాలు లభ్యమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొరంచపల్లి గ్రామానికి చెందిన నలుగురు వరదల్లో కొట్టుకుపొగా.. వరదలు తగ్గిన రెండు రోజుల తర్వాత ఆ మృత దేహాలు లభ్యమయ్యాయి. ముళ్ళ పొదలు, పంట పొలాల్లో విగత జీవులుగా పడివున్న మృత దేహాలను చూసి కుటుంబసభ్యులు, గ్రామస్థులు బోరున విలపించారు..
వెంకటాపురం మండలం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వరదల్లో గల్లంతయ్యారు. అయితే ఇప్పటివరకు వారిలో ఒకరి మృత దేహం మాత్రమే లభ్యమైంది. మరో ఇద్దరు మహిళల కోసం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెద్దవంగర మండలంలో అన్నదమ్ములు ఇద్దరు వరదల్లో కొట్టుకుపోగా తమ్ముడి డెడ్ బాడీ మాత్రమే లభ్యమైoది.. మరో డెడ్ బాడీ కోసం గాలింపు కొనసాగుతోంది. వరద ముప్పు తగ్గిన తర్వాత మిగతా జీవులుగా ముళ్ళపొదలు – పంట పొలాలు, విద్యుత్ స్తంభాల వద్ద లభ్యమైన మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా వినిపిస్తున్నారు. ఓరుగల్లు ప్రజలు ఈ వరదలు మా జీవితంలో మరువలేని మహా విషాదమని తల్లడిపోతున్నారు. వరద ముప్పుతో వేలాది కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయాయి. వందలాది ఇల్లు నేల మట్టమయ్యాయి. కట్టుబట్టలతో ప్రాణాల చేతిలో పెట్టుకొని పరుగులు పెట్టినవారు ఇప్పుడు తిరిగి వచ్చి కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.