పిల్లలు… పసి మొగ్గలు. వాళ్లు కల్మషం అంటూ ఎరుగరు. అలాగే మంచి ఏదో, చెడు ఏదో తెలుసుకునే పరిణితి కూడా వారిలో ఉండదు. అందుకే నిత్యం పసికందుల్ని కనిపెట్టుకుని ఉండాలి. లేనిపక్షంలో ఎంతో ప్రేమతో పెంచుకుంటున్న పాపాయిలు.. దూరం అయ్యే అవకాశం ఉంది. తాజాగా పండుగవేళ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకుంది. బంధువుల ఇంట్లో పండుగకు కుమారుడితో కలిసి వెళ్లిన ఆ దంపతులకు కడపు కోతే మిగిలింది. పల్లీలు తింటుండగా అవి గొంతులో ఇరుక్కుని రెండున్నరేళ్ల కుమారుడు మృతి చెందాడు. దీంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చీకటిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరికుంట్ల సైదులు, శైలజ దంపతులు ఆదివారం బంగారు మైసమ్మ దేవాలయం వద్ద బంధుమిత్రులతో కలిసి పండగ చేసుకోవాలకున్నారు. ఇందుకోసం సన్నిహితులతో పాటు చుట్టాలను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెంలో నివసిస్తున్న శైలజ సోదరి రేణుక, ఆమె భర్త మల్లేశ్, రెండున్నరేళ్ల వయసున్న వారి కుమారుడు అద్విత్ చీకటిగూడెం వచ్చారు. అందరూ రావడంతో ఆ ఇళ్లు ఆనందంతో నిండిపోయింది. ఆ నవ్వులు చూసి విధికి కన్ను కుట్టినట్లు ఉంది. పండగ ఏర్పాట్లలో అందరూ ఉండగా బాలుడు అద్విత్.. వంటింట్లో ఉన్న పల్లీలను తీసుకుని ఒక్కసారిగా నోట్లో వేసుకున్నాడు. అవి గోంతులో ఇరుక్కోవడంతో బాలుడికి ఊపిరాడలేదు. గమనించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెంటనే సూర్యాపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు.
Also Read: స్కూల్స్ ప్రారంభించడం పెను ప్రమాదం.. సెలవులు పొడిగించండి.. సీఎంకు నారా లోకేశ్ లేఖ