Telangana: గుండెల్ని పిండేసే ఘటన.. భార్య మీద కోపంతో పసిప్రాణాన్ని క్రూరంగా..

భార్యాభర్తల మధ్య గొడవ.. చివరకు 18 రోజుల పసికందు పాలిట మరణశాసనంగా మారింది. భార్య మీద కోపంతో ఊగిపోయిన ఓ తండ్రి, కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి.. అత్యంత క్రూరంగా నేలకేసి కొట్టి చంపేశాడు. ఈ అమానుష ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: గుండెల్ని పిండేసే ఘటన.. భార్య మీద కోపంతో పసిప్రాణాన్ని క్రూరంగా..
18 Day Old Infant Killed By Father

Edited By:

Updated on: Jul 18, 2026 | 4:59 PM

సంగారెడ్డి జిల్లా జోగిపేటలో అత్యంత అమానుషమైన, గుండెలను పిండేసే దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే ఆ పసిప్రాణానికి కాలయముడయ్యాడు. భార్యపై ఉన్న కక్షతో ఏ పాపమూ ఎరుగని 18 రోజుల మగ శిశువును నేలకేసి కొట్టి దారుణంగా హత్య చేశాడు. జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని వాసవినగర్ కాలనీలో జరిగిన ఈ ఘోరం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. వాసవినగర్ కాలనీకి చెందిన కృష్ణ, గౌరీ దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా తీవ్రమైన కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం కూడా ఇద్దరి మధ్య మరోసారి తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన కసాయి తండ్రి కృష్ణ.. భార్య గౌరీపై ఉన్న కోపాన్ని తట్టుకోలేక, పక్కనే పడుకుని ఉన్న 18 రోజుల మగ శిశువును లాక్కొని అత్యంత క్రూరంగా నేలకేసి కొట్టాడు.

ఆసుపత్రికి వెళ్లేలోపే అనంత లోకాలకు..

నేలకేసి కొట్టడంతో తీవ్రంగా గాయపడిన చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. దీంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆ పసికందును చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆసుపత్రికి చేరుకునే లోపే ఆ పసికందు మార్గమధ్యంలోనే కన్నుమూసింది. ప్రస్తుతం చిన్నారి మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. పుట్టిన 18 రోజులకే కన్నబిడ్డను కోల్పోయిన తల్లి గౌరీ, కుటుంబ సభ్యుల రోదనలు ఆసుపత్రి వద్ద మిన్నంటాయి.

నిందితుడి కోసం పోలీసుల గాలింపు

ఈ దారుణంపై సమాచారం అందుకున్న జోగిపేట పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న కసాయి తండ్రి కృష్ణ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. కన్న ప్రేమను మరిచి, 18 రోజుల పసికందును పొట్టనబెట్టుకున్న నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిమాండ్ చేస్తున్నారు.

Follow Us