
నల్గొండ, ఏప్రిల్ 30: నల్గొండ జిల్లా నక్రేకల్ మండలం మర్రూర్ గ్రామానికి చెందిన మన్నెం సైదులు, మల్లీశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరి చిన్న కుమారుడు మన్నెం జశ్వంత్ (15) నకిరేకల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు కూడా రాశాడు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న జశ్వంత్.. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనుండగా ఊహించని విధంగా మృత్యువాత పడ్డాడు. బుధవారం (ఏప్రిల్ 30) తండ్రి మన్నెం సైదులు ఇంటిముందు నాగళ్లు, ట్రాక్టర్‌ను ఉంచి ఓ రైసు మిల్లులో పనికి వెళ్లాడు. తల్లి మల్లీశ్వరి కూడా కూలి పనికి వెళ్లింది.
ఈ క్రమంలో ఉదయం 9.30 గంటల సమయంలో జశ్వంత్ ఇంటిముందు ఉన్న ట్రాక్టర్‌ను స్టార్ట్ చేయాలనుకున్నాడు. ఆ సమయంలో ట్రాక్టర్ గేరులో ఉంది. ఈ విషయం తెలియని జశ్వంత్ ట్రాక్టర్ ఎంతకూ స్టార్ట్ కాకపోవడంతో ట్రాక్టర్ ఇంజిన్ సెల్ఫ్ మోటార్ రెండు ఫేజ్‌లను కలిపి బ్యాటరీ కనెక్షన్‌ను సరిచేయడానికి ప్రయత్నించాడు. అంతే.. ఒక్కసారిగా ట్రాక్టర్ స్టార్ట్ అయ్యి.. అకస్మాత్తుగా జశ్వంత్ పైకి దూసుకెళ్లింది.
ట్రాక్టర్ నాగళ్లు కిందకు తిరిగి ఉండటంతో ట్రాక్టర్ పెద్ద టైరు కింద పడిన జశ్వంత్‌ను కొంత దూరం లాక్కెళ్లింది. దీంతో జశ్వంత్ ట్రాక్టర్, నాగళ్ల మధ్య చిక్కుకుని తలకు, ఇతర శరీర భాగాలకు తీవ్రమైన గాయాలు అయ్యి ప్రాణాలతో కొట్టుమిట్టాడాడు. గమనించిన స్థానికులు కొందరు ట్రాక్టర్ స్టార్ట్ చేసి నాగళ్లను పైకి ఎత్తి జశ్వంత్‌ను బయటకు తీశారు. వెంటనే నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. అప్పటికే జశ్వంత్ మృతి చెందినట్లు నిర్థారించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో ఉన్న కుమారుడిని చూసి దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. వీరు రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. అదే రోజు మధ్యాహ్నం విడుదలైన పదోతరగతి ఫలితాల్లో జశ్వంత్‌కు 470 మార్కులు వచ్చాయి. అన్ని సబ్జెక్టుల్లో 60కిపైగా మార్కులు సాధించాడు. మృతుడు జశ్వంత్ తండ్రి మన్నెం సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.