Crime News: అతడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. అందరితో కలివిడిగా మాట్లాడతాడు. పెద్దలకు, స్నేహితులకు తెలిసి ఏ సమస్యా లేదు. కానీ ఉన్నపలంగా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district) ఇల్లందు(Yellandu)కు చెందిన శివలోకేశ్(14) అలియాస్ సోనూ టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. బాలుడి తండ్రి రవి స్థానికంగా టెంట్‌హౌస్ నడుపుతూ ఫ్యామిలీని పోషిస్తున్నాడు. అయితే.. బుధవారం కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో శివలోకేశ్ ఉరేసుకుని జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడు. బయటకు వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి వచ్చేసరికి లోకేశ్ ఫ్యాన్‌ను వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఇరుగుపొరుగువారి సాయంతో.. లోకేశ్‌ను గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మరణించినట్టు డాక్టర్లు నిర్థారించారు. దీంతో అతని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కాగా లోకేశ్.. సూసైడ్ చేసుకునే ముందు తన ఫ్రెండ్ గౌతమ్‌కు ఇన్‌స్టాగ్రాంలో బర్త్ డే విషెడ్ తెలిపాడు. కాసేపటికే చనిపోయాడన్న తెలిసేసరికి.. స్నేహితులు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ క్రమంలోనే లోకేశ్ ఫ్రెండ్స్.. అతని ఇన్స్టాగ్రాం ఫ్రొఫైల్ చూశారు. బయోలో రాసిన విషయాన్ని చదివి ఒక్కసారిగా కంగుతిన్నారు. బయోలో తన మరణతేది 20 జులైగా రాసి ఉండటాన్ని చూసి.. షాకయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పెద్దలకు చెప్పారు. తాను చనిపోవాలని ముందే డిసైడయ్యి.. దాని కోసం డేట్ కూడా ఫిక్స్ చేసి.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రాయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. బాలుడి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..