కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 10.50 శాతం పోలింగ్ నమోదు అయింది. వీణవంకలో పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ కర్ణన్ పరిశీలించారు. 6 చోట్ల ఈవీఎం ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. రాజకీయ పార్టీల నుండి చిన్న చిన్న ఫిర్యాదులు వచ్చాయన్నారు. వంద మీటర్ల లోపు ప్రచారం చేయడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ హుజురాబాద్‌లోని 5 మండలాల్లో బై పోలింగ్‌ను పరిశీలించనున్నారు. కమలాపూర్ మండల కేంద్రం లోని 262 పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఆయన సతీమణి జమున ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమలాపూర్‌లో పోలింగ్ కేంద్రాన్ని కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ పరిశీలించారు. కమలాపూర్ మండలం ఉప్పల్‌లో కాసేపు ఈవీఎం మొరాయించింది. పోలింగ్ నెం.295లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
2018 ఎన్నికల్లో హుజురాబాద్‌లో 84.42 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి అంతకన్నా ఎక్కువే ఓట్లు పోలవుతాయని తెలుస్తోంది. ఎందుకంటే గతంకన్నా 27 వేల మంది ఓటర్లు పెరిగారు. పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఓటింగ్ శాతాన్ని పెంచుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్ గోయల్. కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకుని పోలింగ్ కేంద్రానికి రావాలని సూచించారు అధికారులు.
హుజూరాబాద్ మండలంలో 61, 673 మంది ఓటర్లు, ఇల్లందకుంటలో 24, 799, జమ్మికుంట 59, 200, వీణవంక 40, 990, కమలపూర్ 51, 282 మంది ఓటర్లు ఉన్నారు.1,715 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు.