వాట్సాప్ మెసేజింగ్ కోసమే వాడుతున్నారా? ఇంకేం చేయచ్చో తెలిస్తే ఆశ్చర్యపోతారు
నేటి డిజిటల్ కాలంలో వాట్సాప్ మన జీవితంలో అంతర్భాగమైపోయింది. కేవలం స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మెసేజ్‌లు పంపుకోవడానికే పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతికతతో వాట్సాప్ ఇప్పుడు ఒక శక్తివంతమైన సేవా వేదికగా మారింది. మనకు తెలియకుండానే ఎన్నో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు వాట్సాప్‌లో అధికారిక ఏఐ బాట్‌లను అందుబాటులోకి తెచ్చాయి. వీటి ద్వారా మనం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంట్లో కూర్చునే ముఖ్యమైన పనులను సులభంగా పూర్తి చేసుకోవచ్చు.

రైలు టికెట్లు బుక్ చేసుకోవడం నుంచి పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ పొందడం వరకు ఎన్నో సేవలు ఇప్పుడు వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ సేవలను వినియోగించుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా, ‘గ్రీన్ టిక్’ (వెరిఫైడ్ బ్యాడ్జ్) ఉన్న అధికారిక నంబర్లను మాత్రమే సంప్రదించాలి. మన దైనందిన జీవితంలో ఎంతో ఉపయోగపడే ఆ ముఖ్యమైన వాట్సాప్ సేవలు, వాటి నంబర్ల గురించి తెలుసుకుందాం.
ప్రభుత్వ సేవలు – డిజిలాకర్
భారత ప్రభుత్వానికి చెందిన ‘MyGov’ వాట్సాప్ హెల్ప్‌డెస్క్ నంబర్ (9013151515)కు ‘Hi’ అని మెసేజ్ చేయడం ద్వారా మీరు పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, 10వ తరగతి, 12వ తరగతి మార్కుల జాబితాలు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) వంటి ముఖ్యమైన పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రయాణ, ఆహార సేవలు
రైలు ప్రయాణీకులు తమ బెర్త్ వద్దే ఆహారం పొందడానికి ఐఆర్‌సీటీసీ (IRCTC) నంబర్ +91 70420 62070కి, పిఎన్‌ఆర్ నంబర్‌తో మెసేజ్ చేయాలి. అలాగే, రైలు ప్రయాణంలో కిరాణా, ఆహార వస్తువుల కోసం జియోమార్ట్ (+91 88811 99119) సేవలను ఉపయోగించుకోవచ్చు. ఇక ఢిల్లీ మెట్రోలో క్యూఆర్ కోడ్ టికెట్ల కోసం +91 96508 55800కు, ఢిల్లీ బస్సు టికెట్ల కోసం +91 87440 73223కు మెసేజ్ చేసి క్యూలో నిలబడే ఇబ్బందిని తప్పించుకోవచ్చు.
బ్యాంకింగ్, గ్యాస్ సేవలు
బ్యాంకింగ్ సేవలకు సంబంధించి ఎస్‌బీఐ (+91 90226 90226), హెచ్‌డీఎఫ్‌సీ (+91 70700 22222), ఐసీఐసీఐ (+91 86551 99999) బ్యాంకులు బ్యాలెన్స్ చెక్ చేయడం, మినీ స్టేట్‌మెంట్ పొందడం వంటి సదుపాయాలను కల్పిస్తున్నాయి. అలాగే, గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి ఇండేన్ (+91 75888 88824), హెచ్‌పీ గ్యాస్ (+91 92222 01122), భారత్ గ్యాస్ (+91 18002 24344) నంబర్లకు ‘BOOK’ అని మెసేజ్ చేస్తే సరిపోతుంది.
ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు మీ ఏటీఎం పిన్, సీవీవీ లేదా నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ, ఎక్కడా పంచుకోవద్దు. అధికారిక సంస్థలు ఇటువంటి వివరాలను ఎప్పటికీ అడగవు. ఈ డిజిటల్ సౌకర్యాలను బాధ్యతాయుతంగా ఉపయోగించుకుని మీ పనులను మరింత సులభతరం చేసుకోండి.
