ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ ట్విట్టర్ ను పూర్తిగా కొనుగోలు చేసి, యాజమాన్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు. సంస్థలో ఉన్నత ఉద్యోగులకు ఉద్వాసన పలికిన ఆయన.. మరింత మంది ఉద్యోగులను తొలగించడంపై దృష్టిసారించారు. ఎలన్ మస్క్ అధికారికంగా ట్విట్టర్‌కు బాధ్యత వహిస్తుండటంతో ట్విట్టర్ లో అనేక మార్పులు రానున్నాయని చాలా మంది ముందే ఊహించారు. అంతా అనుకున్నట్లే ఈ మైక్రోబ్లాగింగ్ సేవలో అనేక మార్పులు రానున్నాయి. ఉన్నత ఉద్యోగులను తొలగించిన తర్వాత ఇంకా తొలగించగల ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని ఎలన్ మాస్క్ సంస్థ అధికారులను కోరినట్లు తెలుస్తోంది. కంటెంట్ మోడరేషన్, డిప్లాట్‌ఫార్మింగ్ విధానాన్ని సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ట్విట్టర్ నిర్ణయించింది. అలాగే ట్విట్టర్ లో చేసే ట్వీట్లకు ఇప్పటివరకు అక్షర పరిమితి ఉంది. 280 అక్షరాలకు మించి ఒక ట్వీట్ లో రాయలేము. భవిష్యత్తులో ఈ అక్షర పరిమితిని తొలగించే యోచనలో ట్విట్టర్ అధినేత ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక వేళ ఈ నిర్ణయం తీసుకుంటే ట్విట్టర్ వినియోగదారులకు ఇదొక మంచి మార్పు అనే చెప్పుకోవాలి. ట్వీట్ చేసే అంశం ఎక్కువుగా ఉన్నప్పుడు ఒకటి కంటే ఎక్కువ ట్వీట్లు చేయాల్సి వస్తోంది. ఒకవేళ అక్షర పరిమితిని తొలగిస్తే మాత్రం ఒకే ట్వీట్ లో మొత్తం సారాంశాన్ని పోస్టు చేసే అవకాశం కలగనుంది. అయితే అక్షర పరిమితిని ఎత్తివేస్తారనే చర్చ తాజాగా రావడానికి ఓ వినియోగదారుడు అడిగిన ప్రశ్నకు ఎలన్ మస్క్ ఇచ్చిన సమాధానమే కారణం.
అక్షర పరిమితులను వదిలించుకోగలమా లేదా దానిని విస్తరించగలమా అని ఓ వినియోగదారుడు చేసిన ట్వీట్ కు ఎలన్ మస్క్ కచ్చితంగా అంటూ సమాధానం ఇచ్చాడు. అంటే రానున్న రోజుల్లో ట్వీట్లలో అక్షర పరిమితి తొలగిపోనుందనే చర్చ విస్తృత్తమైంది. మొదట్లో ట్వీట్టర్ లో చేసే ఒక్కో ట్వీట్ అక్షరపరిమితి 140 అక్షరాలు ఉండేది. అయితే 2017లో ఆ సంస్థ అక్షరాల పరిమితిని 280కి పెంచింది. మరి రానున్న రోజుల్లో ఎలన్ మస్క్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.
can we get rid of character limits, or at least greatly expand it? One of the actual better things about wechat than Twitter. Would be better for public discourse than short fuses, no?
— Daniel Ku 顧仲文 ???? (@danzwku) October 30, 2022
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం చూడండి..