Jio: బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఎదురుదెబ్బ.. అతిపెద్ద ల్యాండ్‌లైన్‌ కంపెనీగా అవతరించిన జియో

Subhash Goud

Subhash Goud |

Updated on: Oct 19, 2022 | 12:44 PM

ప్రస్తుతం టెలికాం కంపెనీలు దూసుకుపోతున్నాయి. పోటాపోటీగతా కస్టమర్లను చేర్చుకునే పనిలో పడ్డాయి. ఇక 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో తమ..

Jio: బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఎదురుదెబ్బ.. అతిపెద్ద ల్యాండ్‌లైన్‌ కంపెనీగా అవతరించిన జియో
Reliance Jio

ప్రస్తుతం టెలికాం కంపెనీలు దూసుకుపోతున్నాయి. పోటాపోటీగతా కస్టమర్లను చేర్చుకునే పనిలో పడ్డాయి. ఇక 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో తమ సేవలను మరింతగా మెరుగు పర్చే క్రమంలో పడ్డాయి టెలికాం కంపెనీలు. ప్రైవేట్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఆగస్టులో ప్రభుత్వరంగ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌)ని అధిగమించి దేశంలోనే అతిపెద్ద ఫిక్స్‌డ్ లైన్ సర్వీస్ ప్రొవైడర్‌గా అవతరించింది. దేశంలో టెలికాం సర్వీస్‌ను ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారిగా వైర్‌లైన్ విభాగంలో ఓ ప్రైవేట్ కంపెనీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) మంగళవారం విడుదల చేసిన కస్టమర్ నివేదిక ప్రకారం.. ఆగస్టులో రిలయన్స్ జియో వైర్‌లైన్ చందాదారుల సంఖ్య 73.52 లక్షలకు చేరుకోగా, బీఎస్‌ఎన్‌ఎల్‌ చందాదారుల సంఖ్య 71.32 లక్షలకు చేరుకుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ గత 22 సంవత్సరాలుగా దేశంలో వైర్‌లైన్ సేవలను అందిస్తోంది. అయితే జియో తన వైర్‌లైన్ సేవలను మూడేళ్ల క్రితమే ప్రారంభించింది. దీంతో దేశంలో వైర్‌లైన్ చందాదారుల సంఖ్య జూలైలో 2.56 కోట్ల నుంచి ఆగస్టులో 2.59 కోట్లకు పెరిగింది. ట్రాయ్‌ నివేదిక ప్రకారం.. వైర్‌లైన్ సేవలను ఉపయోగించే వ్యక్తుల సంఖ్య పెరగడానికి ప్రైవేట్ రంగం దోహదపడింది. ఈ కాలంలో జియో 2.62 లక్షల మంది, భారతీ ఎయిర్‌టెల్ 1.19 లక్షలు, వొడాఫోన్ ఐడియా (వీ), టాటా టెలిసర్వీసెస్‌లు వరుసగా 4,202, 3,769 మంది కొత్త కస్టమర్‌లను చేర్చుకున్నాయి.

బీఎస్‌ఎన్‌ఎల్‌కు తగ్గుతున్న కస్టమర్లు:

ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కోలు బీఎస్ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ ఆగస్టు నెలలో వరుసగా 15,734,13,395 వైర్‌లైన్ చందాదారులను కోల్పోయాయి. ఆగస్టులో దేశంలో మొత్తం టెలికాం సబ్‌స్క్రైబర్ల సంఖ్య స్వల్పంగా 1175 మిలియన్లకు పెరిగింది. జియో చాలా మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లను జోడించింది. అలాగే, పట్టణ కేంద్రాల కంటే గ్రామీణ ప్రాంతాలు అధిక స్థాయిలో వృద్ధి సాధించింది. ట్రాయ్‌ ఆగస్ట్ 2022 కస్టమర్ రిపోర్ట్ ప్రకారం.. భారతదేశంలో టెలిఫోన్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య జూలై 2022 చివరి నాటికి 117.36 కోట్ల నుండి ఆగస్ట్ 2022 చివరి నాటికి 117.50 కోట్లకు పెరిగింది. గత నెలతో పోలిస్తే 0.12 శాతం పెరిగింది.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ సంస్థలకు అత్యధిక నష్టం

ఈ ఏడాది ఆగస్టులో రిలయన్స్ జియో (32.81 లక్షలు), భారతీ ఎయిర్‌టెల్ (3.26 లక్షలు) మాత్రమే కొత్త మొబైల్ చందాదారులను చేర్చుకున్నాయి. అయితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రైవేట్ కంపెనీ వోడాఫోన్‌ ఐడియా ఈ నెలలో 19.58 లక్షల మొబైల్ చందాదారులను కోల్పోయింది. ఈ కాలంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 5.67 లక్షలు, ఎంటీఎన్‌ఎల్‌ 470, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 32 మంది కస్టమర్లను కోల్పోయాయి.

ఇక దేశంలో 5G మొబైల్ సేవ ప్రారంభమైంది. ముందుగా కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభం అయ్యాయి. తర్వాత దేశవ్యాప్తంగా 5జీ సేవలను పెంచనున్నారు. ఇందులో జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్‌ ఐడియా ఉన్నాయి. మూడు కంపెనీలు తమ 5జీ సేవలను దశలవారీగా వివిధ రాష్ట్రాల్లో ప్రారంభించనున్నాయి.ఈ సేవ ప్రస్తుతం దేశంలోని 8 నగరాల్లో అందించబడుతోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu