
అంగారక గ్రహాన్ని నివాసయోగ్యంగా మార్చేందుకు మనుషులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం కొంతమంది అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించారు. కొంతమంది శాస్త్రవేత్తలు అంటార్కిటిక్ ఎడారి నాచు లేదా అంగారక గ్రహంపై పరిస్థితులను తట్టుకోగల లైకెన్ వంటి మొక్కలను పెంచడం ద్వారా అక్కడ మనిషి నివశించేందుకు అనువైన పరిస్థితులు నెలకొల్పాలని సూచించారు. అయితే ఒక పోలిష్ శాస్త్రవేత్త వీటిని సాధించడం చాలా కష్టమని పేర్కొంటూ, బదులుగా అంగారక గ్రహాన్ని నివాసయోగ్యంగా మార్చడానికి ఒక పద్ధతిని సూచిస్తున్నారు. పోలిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకుడు డాక్టర్ లెస్జెక్ చెకోవ్స్కీ ఈ కొత్త ప్రతిపాదన చేశారు.
అంగారక గ్రహం నేల, రెగోలిత్, మానవులకు హానికరమైన పెర్క్లోరేట్లతో నిండి ఉంటుంది. అలాగే, గ్రహం మీద తక్కువ వాతావరణ పీడనం, ఒత్తిడితో కూడిన స్పేస్‌సూట్ ధరించకపోతే మానవ శరీరంలోని నీటిని మరిగేలా చేస్తుంది. “ఎనర్జీ ప్రాబ్లమ్స్ ఆఫ్ టెర్రాఫార్మింగ్ మార్స్” అనే తన వ్యాసంలో డాక్టర్ చెకోవ్స్కీ అంగారక గ్రహాన్ని గ్రహశకలాలతో ఢీకొట్టించడంతో మరింత ఆచరణాత్మక పరిష్కారం అని ప్రతిపాదించారు. కైపర్ బెల్ట్ లేదా బయటి, ఊహాత్మక ఊర్ట్ క్లౌడ్‌లోని ఘనీభవించిన గ్రహశకలాలు అంగారక గ్రహంపై వాతావరణాన్ని నిర్మించడానికి ఒక మార్గాన్ని చూపిస్తాయని అంటున్నారు.
అంగారక గ్రహ వాతావరణం ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్‌తో నిర్మితమైంది. ఇది జీవానికి సరైంది కాదు. ఘనీభవించిన గ్రహశకలాలు అంగారక గ్రహాన్ని ఢీకొట్టడం ద్వారా, మనిషి మనుగడకు సహాయపడే వాయువులను విడుదల చేయడం సాధ్యమవుతుంది. నెప్ట్యూన్ అవతల లోతుగా ఉన్న ఊర్ట్ క్లౌడ్, ఈ లక్ష్యం కోసం ఉపయోగించగల బిలియన్ల కొద్దీ మంచుతో నిండిన గ్రహశకలాలను కలిగి ఉందని డాక్టర్ చెకోవ్స్కీ పేర్కొన్నారు. కానీ ప్రస్తుత సాంకేతికతతో ఊర్ట్ క్లౌడ్ నుండి అంగారక గ్రహానికి ఒక గ్రహశకలం చేరుకోవడానికి 15,000 సంవత్సరాలు పడుతుంది. ఇది దీర్ఘకాలిక విధానం అయినప్పటికీ, డాక్టర్ చెకోవ్స్కీ ఆలోచన సుదూర భవిష్యత్తులో అంగారక గ్రహాన్ని మానవ అనుకూల గ్రహంగా మార్చడానికి ఒక సాధ్యమైన మార్గాన్ని సూచిస్తుంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.