దేశంలో ఆన్ లైన్ మార్కెట్ స్థాయి విపరీతంగా పెరిగింది. ప్రజలందరూ పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తున్నారు. తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ధర అందుబాటులో ఉండడం, వస్తువులపై అనేక ఆఫర్లు ప్రకటించడం, డెలివరీ చేశాకే డబ్బులు చెల్లించే అవకాశం ఉండడంతో ఆన్ లైన్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగిపోతోంది. అయితే ఆన్ లైన్ మార్కెట్ లో పలువురు స్కామ్ లకు పాల్పడుతున్నారు. మనం ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా మోసపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సురక్షితంగా ఉండవచ్చు. ఆగస్టు 15ను పురస్కరించుకుని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తో పాటు ఇతర ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లు తమ వినియోగదారుల కోసం గొప్ప డీల్‌లు ప్రకటించాయి. వివిధ వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్లు అందజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే మోసాలకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సుప్రీంకోర్టులో పనిచేస్తున్నముకుంద్ పి. ఉన్ని జూలై 21న అమెజాన్ లో ఐఫోన్ 15ని ఆర్డర్ పెట్టారు. తన దగ్గర ఉన్నఐఫోన్ 13ను ఎక్స్చేంజ్ చేసి కొత్త ఫోన్ తీసుకోవాలనుకున్నారు. ఇందుకోసం రూ.38 వేలు పెట్టి కొత్త ఫోన్ ను ఆర్డర్ చేశారు. డెలివరీ ఎగ్జిక్యూటివ్ జూలై 22వ తేదీ రాత్రి 9.30 గంటలకు ఆయన ఇంటికి వెళ్లాడు. ముకుంద్ ఓటీపీని చెప్పి ఐఫోన్ 15ను తీసుకున్నారు. తన దగ్గర ఉన్న పాత ఐఫోన్ 13ను డెలివరీ ఎగ్జిక్యూటివ్ కు ఇచ్చేవారు. అయితే అతడు మరో ఓటీపీ కావాలని ముకుంద్ ను అడిగాడు. తన దగ్గర ఒక్కటే ఉందని చెప్పడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎక్స్చేంజ్ ఫైనల్ అవ్వలేదు కాబట్టి, కొత్త ఫోన్ వెనక్కు ఇవ్వాలని చెప్పి డెలివర్ ఎగ్జిక్యూటీవ్ ఐఫోన్ 15ను తీసుకుని వెళ్లపోయాడు. ఈ విషయంపై జూలై 23న అమెజాన్ కస్టమర్ కేర్ కు ముకుంద్ ఫిర్యాదు చేశారు. కానీ వారు సరిగ్గా స్పందించలేదు. ఆఖరుకు ఆగస్టు ఒకటిన ముకుంద్ ఫోన్ చేయగా, ఆయన కట్టిన డబ్బులు వెనక్కు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. దీనిపై ఎక్స్ లో ముకుంద్ పోస్ట్ పెట్టారు. డెలివర్ బాయ్ తనను ఎలా మోసం చేశాడో దానిలో తెలిపారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో అమెజాన్ స్పందించింది. ఆయన డబ్బులను వెనక్కు పంపించింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..