ఆకాశం నుంచి పడ్డ వింత ఆకారం.. సముద్ర తీరంలో ప్రత్యక్షం! తాకొద్దని పోలీసుల వార్నింగ్.. రంగంలోకి సైంటిస్టులు
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ తీరంలో ఆరు రహస్యమైన వెండి గోళాలు కలకలం రేపాయి. ఇవి రాకెట్ ప్రయోగాల అనంతరం సముద్రంలో పడిపోయే అంతరిక్ష శిథిలాలే అయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రజలు వీటిని తాకవద్దని హెచ్చరించారు. ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ సహా పలు సంస్థలు వీటి మూలాలను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నాయి.

ఆస్ట్రేలియాలోని ఉత్తర క్వీన్స్‌లాండ్ తీరంలో రహస్యమైన సిల్వర్ బాల్ కనిపించడం కలకలం రేపింది. టౌన్స్‌విల్లేకు ఉత్తరాన ఉన్న ఫారెస్ట్ బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఈ భారీ గోళాలు అంతరిక్ష శిథిలాలే అయి ఉండొచ్చన్న అనుమానాలతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ బాల్ రాకెట్ ప్రయోగాల అనంతరం సముద్రంలో పడిపోయే “స్పేస్ బాల్స్” అయి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ (ASA) కూడా స్పందించి, వాటి మూలాన్ని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.
ఈ గోళాల్లో ప్రమాదకర రసాయనాలు ఉండే అవకాశం ఉందని అనుమానించిన పోలీసులు, ప్రజలు వాటిని తాకవద్దని హెచ్చరించారు. క్వీన్స్‌లాండ్ అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. బీచ్‌లో మొత్తం ఆరు భారీ గోళాకార వస్తువులు గుర్తించారు. వాటిలో ఐదింటిని ప్రత్యేక డ్రమ్ముల్లో భద్రపరచగా, మరో వస్తువును సురక్షితంగా తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ సందర్భంగా సిబ్బంది ప్రత్యేక రక్షణ సూట్లు ధరించి పనిచేశారు. భద్రతా కారణాల దృష్ట్యా గోళాలు కనిపించిన ప్రాంతం చుట్టూ 50 మీటర్ల మేర నిషేధిత మండలాన్ని ప్రకటించారు. అనంతరం పరిస్థితి అదుపులోకి రావడంతో ఆంక్షలను సడలించారు.
Queensland Fire and Rescue crews are continuing to assist partner agencies following the discovery of several potentially hazardous objects around Forrest Beach in North Queensland.
Specialist QFR Scientific teams have safely secured a number of the items throughout the weekend… pic.twitter.com/BVq9xJPPlX
— Queensland Fire Department (@QldFireDept) July 5, 2026
ఈ ఘటనపై స్థానిక పోలీసులతో పాటు నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ, ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయి. ప్రస్తుతం స్థానిక ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని పోలీసులు స్పష్టం చేసినప్పటికీ, వస్తువుల అసలు స్వరూపం, అవి ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై శాస్త్రీయ పరీక్షలు కొనసాగుతున్నాయి. అంతరిక్ష ప్రయోగాల అనంతరం సముద్రంలో పడే పరికరాల అవశేషాలు కొన్నిసార్లు అలలతో తీరానికి కొట్టుకొస్తుంటాయి. అయితే ఫారెస్ట్ బీచ్‌లో ఒకేసారి ఆరు భారీ వెండి గోళాలు కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది. ఈ వస్తువులు నిజంగానే అంతరిక్ష శిథిలాలా? లేక మరేదైనా పారిశ్రామిక పరికరాల భాగాలా? అన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
