Solar Storm: సౌర తుపాను వచ్చేస్తోంది.. కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలడం ఖాయం అంటూ గత కొన్ని రోజులుగా భూమికి దడ పుట్టిస్తున్న ప్రచారం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది. జూలై మధ్యలో సౌర తుపాను దాటేసిందన్న కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై స్పందించిన శాస్త్రవేత్తలు ఇలాంటి పుకార్లు ఉత్తవేనని తేల్చి చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే సౌర తుపాను ముప్పు మాత్రం భూమికి పొంచి ఉందని.. అది జరిగితే మాత్రం ఇంటర్నెట్ ఆగిపోయి కోలుకోలేని నష్టం చవిచూడాల్సి వస్తోందని కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇర్విన్‌కు చెందిన అసిస్టెంట్ ఫ్రొఫెసర్ సంగీత అబూ జ్యోతి చెబుతున్నారు.
సౌర తుపానుల వల్ల ఇంటర్నెట్ వ్యవస్థపై ముఖ్యంగా సముద్ర అంతర్భాగం గుండా విస్తరించి ఉన్న కేబుల్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది. జీపీఎస్ వ్యవస్థ కుప్పకూలుతుంది. అప్పుడు మొత్తం వ్యవస్థ ఆగిపోయే అవకాశాలున్నాయి. ఇది కరోనా మహమ్మారిలాగే పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది అని ఆమె పేర్కొంటున్నారు. సౌర తుపాన్లు అనేవి అరుదుగా వస్తుంటాయి. గతంలో 1859, 1921లో భూమిని తాకాయి. 1989లో ఓ మోస్తరు తుపాను కూడా సంభవించింది. ఆయా సమయాల్లో రేడియో వ్యవస్థలు మూగబోయాయి. అయితే ఇప్పుడున్నంత ఎలక్ట్రిక్ గ్రిడ్స్, ఇంటర్నెట్వ్యవస్థ ఆ సమయంలో లేదు. అందుకే తీవ్ర నష్టం ఉందన్నారు.
సిగ్‌కామ్ 2021(SIGCOMM 2021) పేరుతో జరిగిన డేటా కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు సౌర తుపానుల మీద ఆమె సమర్పించిన ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ సౌర తుపాన్ గనుక భూమిని తాకితే.. ఆ ప్రభావంతో గంటల నుంచి రోజుల తరబడి కమ్యూనికేషన్ వ్యవస్థ ఆగిపోనుందని ఆమె అంటున్నారు. అయితే ఈ వాదనతో పలువురు శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు సైతం అంగీకరించడం ఆందోళనకు గురి చేస్తోంది.
సముద్ర అంతర్బాగం నుంచి విస్తరించి ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్‌పై సౌర తుపాను తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కరోనా మహమ్మారి లాగానే పెద్ద సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఆప్టికల్ సిగ్నల్స్ తరచూ ఇబ్బందికి గురికావడంతో అంతర్గత వ్యవస్థల్లో పెద్ద ఎత్తున్న దెబ్బతినే ప్రమాదం ఉంది. అప్పుడు మొత్తం ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతుంది. ఆ ప్రభావం ఎన్నిరోజులు చూపెడుతుంది? ఎన్నిరోజుల్లో తిరిగి యధాస్థితికి తీసుకురావచ్చు అనే విషయాలపై మాత్రం ఇప్పుడే అంచనాకి రాలేమని అంటున్నారు. అంత పెద్ద విపత్తు ఎదుర్కొవడానికి అంతర్జాతీయ సమాజం సిద్దంగా లేదు. నష్టం కూడా బాగానే ఉండవచ్చు అంటున్నారు అబూ జ్యోతి.
ఒక వేళ సౌర తుపాను విరుచుకుపడితే ఆసియా దేశాలకు తక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆమె అంటున్నారు. ఎందుకంటే భూమధ్య రేఖకు దగ్గరగా సముద్ర గర్భ కేబుల్స్ ఉండటం కలిసొచ్చే అంశమని చెబుతున్నారు. ఈ లెక్కన భారత్ సహా మరికొన్ని దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అట్లాంటిక్, ఫసిఫిక్ మహాసముద్రాల పరిధిలోని అంతర్గత కేబుల్ వ్యవస్థ మాత్రం సౌర తుపానుతో ఘోరంగా దెబ్బతింటుందని ఆమె అంటున్నారు.
My SIGCOMM talk on the impact of solar superstorms on the Internet infrastructure is now online: https://t.co/L6Nl2Yygcs
There were many interesting questions in the Q&A session.Paper: https://t.co/Wsv4RC2pbZ https://t.co/Y9ElvF7fTa
— Sangeetha Abdu Jyothi (@sangeetha_a_j) August 29, 2021