Ghibli Art: మీ ముఖాన్ని ‘ఏఐ’ దొంగిలిస్తోందా? ఘిబ్లీ ఆర్ట్‌పై తెలుసుకోవాల్సిందిదే..!
లేటెస్ట్ ఏఐ సెన్సేషన్ ఘిబ్లీ ఆర్ట్.. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత, ఫ్యామిలీ చిత్రాలను అప్ లోడ్ చేసి.. ఏఐ అందించే కళాత్మక చిత్రాలను తమ సోషల్ మీడియా ప్లాట్ ఫారంలలో షేర్ చేసుకుంటున్నారు. అవి చూడటానికి ఎంతో ఆహ్లాదాన్ని పంచే విధంగా ఉంటున్నాయి. దానిపై వచ్చే కామెంట్లు, లైక్లను వినియోగదారులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఘిబ్లీ చిత్రాల కోసం వినియోగదారులు తమ ముఖాలు స్పష్టంగా కనిపించేలా హై రిజల్యూషన్ చిత్రాలను ఏఐలోకి అప్ లోడ్ చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో ప్రమాదాలకు తావిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫేస్ రికగ్నిషన్ ద్వారా లావాదేవీలు, స్మార్ట్ ఫోన్ లాక్ లు వినియోగించే వారికి ప్రమాదం పొంచి ఉంటుదని చెబుతున్నారు.

టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతి రోజూ ఏదో ఒక అప్ డేట్ రావడం.. అది ట్రెండింగ్లోకి వచ్చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) చేస్తున్న అద్భుతాలు మనం చూస్తూనే ఉన్నాం. ఓపెన్ ఆధ్వర్యంలోని చాట్ జీపీటీతో పాటు అనేక రకాల చాట్ బాట్ లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా అందిప్రయోజనాలతో పాటు ఇబ్బందికర పరిస్థితులు కూడా మనిషికి వస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త అప్ డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చాట్ జీపీటీ-4ఓ సౌజన్యంతో వచ్చిన ఘిబ్లీ స్టైల్ పోర్ట్రెయిట్‌లు సన్సెషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫారం చూసిన ఈ ఘిబ్లీ స్టైల్ పోర్ట్రెయిట్‌లే దర్శనమిస్తున్నాయి. ఈ ఏఐ జనరేటెడ్ అవతార్ ను ప్రజలు విస్తృతంగా షేర్ చేస్తున్నాయి. ఈ ట్రెండ్ కేవలం వ్యక్తిగత చిత్రాలకే పరిమితం కాలేదు.. వైరల్ ట్రెండ్‌లో భాగం కావడానికి వినియోగదారులు పిల్లలతో సహా కుటుంబ చిత్రాలను కూడా అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఏఐ కంపెనీలకు పంపుతున్న మన చిత్రాలు ఎంత వరకూ భద్రం అని? భవిష్యత్తులో వాటి వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా అన్నా ప్రశ్న అందరిలోనూ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ ఘిబ్లీ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మీ ముఖమే కరెన్సీ!
ఏఐ జనరేట్ చేస్తున్న ఘిబ్లీ చిత్రాలు వినోదాత్మకంగా ఉంటున్నాయి. వాటిని చూస్తున్న వినియోగదారులు ఎంతో ఉత్సాహంగా సోషల్ మీడియా ప్లాట్ ఫారంలలో షేర్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరూ ఉన్న చిత్రాలను సైతం ఏఐకి అందించి, ఘిబ్లీ స్టైల్ చిత్రాలను తీసుకుంటున్నారు. ప్రతిరోజూ లక్షలాది మంది తమ ముఖ డేటాను ఏఐ కంపెనీలకు ఇష్టపూర్వకంగా సమర్పిస్తున్నారు. దాంతో పాటు ఆ ఏఐ టూల్ ఉండే యాప్ లకు కెమెరా అనుమతులు, గ్యాలరీ అనుమతులను వినియోగదారులు ఇవ్వాల్సి వస్తోంది. సరిగ్గా ఇక్కడే సెక్యూరిటీ ప్రశ్నార్థకం అవుతోంది. వాస్తవానికి మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే ఏఐ సంస్థలు ఈ చిత్రాలను ప్రాసెస్ చేయవు.. అవి మీ ముఖం కొలతలను స్కాన్ చేస్తాయి. నిల్వ చేస్తాయి. ఆ తర్వాత మ్యాప్ చేస్తాయి. అంటే మీ ముఖ గుర్తింపు శాశ్వతంగా ఉంటుంది. అంటే ఏఐ మీ ముఖాన్ని శాశ్వతంగా స్టోర్ చేసుకుంటుంది. ఇది సర్వసాధారణంగా మారదు కాబట్టి.. తర్వాత దానిని వ్యతిరేఖ మార్గంలో వినియోగిస్తే.. పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది.
నీ ముఖం చూసి ఎవరు లాభం పొందుతున్నారు?
2021లో 5.01 బిలియన్ డాలర్లు ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (ఎఫ్ఆర్టీ) పరిశ్రమ 2028 నాటికి 12.67 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. మెటా, గూగుల్ వంటి ప్రధాన టెక్ దిగ్గజాలు తమ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి యూజర్ ఇమేజ్‌లను ఉపయోగిస్తున్నాయని చాలా కాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ ఈ దోపిడీ ఎంత లోతుగా సాగుతుందో వారు నోరు విప్పడం లేదు. మరి ఇలాంటి సమయంలో మన ఫేస్ ను భద్రంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఘిబ్లీ స్టైల్ ఇమేజ్ ను చేసుకోవడం మంచిదేనా?
ఇలా చేస్తే మీరు సేఫ్..
- ఏఐ-ఆధారిత ప్లాట్‌ఫామ్‌లలో అధిక రిజల్యూషన్ ఫోటోలను అప్‌లోడ్ చేయడాన్ని నివారించండి.
- ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌లకు బదులుగా పిన్‌లు లేదా పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి.
- యాప్‌ల నుంచి అనవసరమైన కెమెరా అనుమతులను రద్దు చేయండి.
- బయోమెట్రిక్ డేటాను ఎలా సేకరిస్తారు.. ఎలా ఉపయోగిస్తారో వెల్లడించమని ప్రభుత్వాలు.. టెక్ కంపెనీలను ఒత్తిడి చేయండి.
- ప్రభుత్వాలు ముఖ గుర్తింపు అనధికార వినియోగాన్ని నిషేధించాలి. ఏఐ అపరిమిత విస్తరణను అరికట్టడానికి కఠినమైన చట్టాలను విధించాలి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి