India’s Space Sector: 2040 నాటికి చంద్రుడిపై మనిషిని దింపుతాం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 44 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేశారు. గగన్ యాన్ మానవ అంతరిక్ష మిషన్, నేషనల్ స్పేస్ ఇన్నోవేషన్ అండ్ అప్లికేషన్స్ (NSIL) వంటి కార్యక్రమాల ద్వారా ఈ వృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. భారతదేశం అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ నాయకత్వ పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

Indias Space Sector: 2040 నాటికి చంద్రుడిపై మనిషిని దింపుతాం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌
Union Minister Dr Jitendra

Updated on: Mar 09, 2025 | 12:36 PM

సమీప భవిష్యత్తులో భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ 44 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర సైన్స్ అండ్‌ టెక్నాలజీ శాఖా మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ అన్నారు. ఇది దాదాపు ఐదు రెట్లు వృద్ధిని సూచిస్తుందని ఆయన అంచనా వేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్‌షిప్ నిర్వహించిన ‘స్పేస్-టెక్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ కాన్క్లేవ్‌లో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రసంగించారు. నేషనల్ స్పేస్ ఇన్నోవేషన్ అండ్ అప్లికేషన్స్ (NSIL) ఇన్-స్పేస్‌ల గురించి ప్రస్తవించారు. ఇవి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించాయి, భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను 8 బిలియన్ డాలర్లకు పెంచాయని అన్నారు. ప్రపంచ అంతరిక్ష పరిశోధనలో ఇండియా స్థాయి పెరుగుతుందని జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.

ఆయన మాట్లాడుతూ.. మనం వేరే దేశాల సాయం తీసుకునే రోజులు పోయాయని, ఇప్పుడు భారతదేశం ఇతరులకు ఒక దారి చూపే స్థాయికి చేరుకుందని అన్నారు. అలాగే అంతరిక్ష రంగ అభివృద్ధికి భారత ప్రభుత్వం చేస్తున్న కృషి ఈ సందర్భంగా వివరించారు. అంతరిక్ష బడ్జెట్ 2013-14లో 5,615 కోట్ల నుండి ఇటీవలి బడ్జెట్‌లో 13,416 కోట్లకు పెరిగిందని, ఇది 138.93 శాతం ఎక్కువ అని పేర్కొన్నారు. ఇస్రో ఇటీవల నావిక్ ఉపగ్రహంతో తన 100వ ఉపగ్రహ ప్రయోగాన్ని జరిపింది, ఇది భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో కీలకమైన మైల్‌స్టోన్‌గా ఆయన అభివర్ణించారు. ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ రంగంలో స్టార్టప్‌ల సంఖ్య పెరుడుతూ మంచి ఆదాయ వనరుగా మారుతుందన్నారు.

ఇండియా 433 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది, వాటిలో 396 ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో 2014 నుంచి జరిగాయి. ఈ ప్రయోగాలతో 192 మిలియన్‌ డాలర్లు, 272 మిలియన్‌ యూరోల ఆదాయాన్ని ఆర్జించాయని వెల్లడించారు. భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలపై దృష్టి సారించి, అంతరిక్ష పరిశోధన కోసం ఇండియా సిద్ధం చేసుకున్న ప్రణాళికను ఆయన తెలిపారు. భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష మిషన్.. గగన్‌యాన్ మిషన్ కోసం ట్రయల్స్ 2025 చివరి నాటికి ROBO మిషన్‌తో ప్రారంభం కానున్నాయని ఆయన ప్రకటించారు. ఈ మిషన్ కోసం నలుగురు వ్యోమగాములను గుర్తించారు, ఒకరిని ఇప్పటికే అమెరికా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించడానికి ఆహ్వానించింది.

2035 నాటికి ఇండియా, “భారత్ అంతరిక్ష్ స్టేషన్‌”ను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2040 నాటికి భారతదేశం తన మొదటి వ్యోమగామిని చంద్రునిపైకి పంపాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థకు ప్రధాన స్తంభాలలో ఒకటైన భారత వ్యవసాయ రంగంలో అంతరిక్ష సాంకేతికత పాత్రను కూడా కేంద్ర మంత్రి వివరించారు. వాతావరణ అంచనా, కమ్యూనికేషన్, విపత్తు సంసిద్ధత, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, పట్టణ ప్రణాళిక, భద్రతను మెరుగుపరచడంలో ఇది అమూల్యమైన శక్తిగా మారిందని పేర్కొన్నారు. పొరుగు దేశాలు భారతదేశ ఉపగ్రహ వ్యవస్థలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయని, లోకల్‌ స్పేస్‌ లీడర్‌గా ఇండియా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ గర్వంగా చెప్పారు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి