Railway Ticket: రైలు జనరల్ టికెట్లనూ క్యాన్సిల్ చేసుకోవచ్చు.. అదెలా? తెలియాలంటే ఇది చదవండి..

యూటీఎస్‌ యాప్‌ ద్వారా టికెట్‌ బుకింగ్‌కు క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డులు ఉపయోగించడాన్ని ప్రోత్సహించేందుకు సర్వీస్‌ చార్జీని కూడా రైల్వే మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. అయితే ఈ యూటీఎస్‌ యాప్‌లో టికెట్‌ బుక్‌ చేసుకోవడం సరే.. మరి క్యాన్సిలేషన్‌ సంగతి ఏంటి? అసలు టికెట్‌ క్యాన్సిలేషన్‌ కుదురుతుందా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Railway Ticket: రైలు జనరల్ టికెట్లనూ క్యాన్సిల్ చేసుకోవచ్చు.. అదెలా? తెలియాలంటే ఇది చదవండి..
Uts App
Follow us

|

Updated on: Aug 20, 2024 | 1:24 PM

రైలు టికెట్‌ బుక్‌ చేసుకోడానికి చాలా రకాల మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌, ఆఫ్‌ లైన్‌ విధానాల్లో టికెట్ల బుకింగ్‌, క్యాన్సిలేషన్‌ చేసుకోవచ్చు. అయితే ముందస్తు రిజర్వేషన్ల కోసం మాత్రమే ఈ మార్గాలు ఉపయోగపడుతాయి. అయితే కేవలం అన్‌ రిజర్వుడ్‌ బోగీలు మాత్రమే ఉండే సబర్బన్‌, నాన్‌ సబర్బన్‌ రైళ్లలో టికెట్‌ బుకింగ్‌కి అవకాశం గతంలో ఉండేది కాదు. అయితే 2014లో భారతీయ రైల్వే అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్‌) యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ వినియోగదారులను సబర్బన్, నాన్-సబర్బన్ రైళ్లలో టికెట్‌లను బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. దీని ద్వారా 200 కి.మీ దాటిన నాన్-సబర్బన్ స్టేషన్ టికెట్‌లను ప్రయాణ తేదీ కన్నా మూడు రోజులు ముందుగానే కొనుగోలు చేయవచ్చు. అలాగే 200 కి.మీ లోపు ఉండే సబర్బన్ టికెట్‌లను ప్రయాణం రోజున బుక్‌ చేసుకోవచ్చు. అంతేకాక ఈ యూటీఎస్‌ యాప్‌ ద్వారా టికెట్‌ బుకింగ్‌కు క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డులు ఉపయోగించడాన్ని ప్రోత్సహించేందుకు సర్వీస్‌ చార్జీని కూడా రైల్వే మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. అయితే ఈ యూటీఎస్‌ యాప్‌లో టికెట్‌ బుక్‌ చేసుకోవడం సరే.. మరి క్యాన్సిలేషన్‌ సంగతి ఏంటి? అసలు టికెట్‌ క్యాన్సిలేషన్‌ కుదురుతుందా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రెండు రకాలుగా టికెట్ల బుకింగ్‌..

యూటీఎస్‌ యాప్‌లో రెండు రకాలుగా టికెట్లు బుక్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. పేపర్‌ లెస్‌, పేపర్‌ టికెట్‌. పేపర్‌లెస్ ఆప్షన్లో మీరు ఆన్‌లైన్‌లో టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రింటెడ్ కాపీ అవసరం లేకుండా ప్రయాణించవచ్చు. మరోవైపు పేపర్ టికెట్ కోసం యూటీఎస్‌ యాప్ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపు చేసిన తర్వాత మీరు దానిని రైల్వే స్టేషన్ కౌంటర్ లేదా ఏటీవీఎం మెషీన్‌లలో ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పేపర్‌లెస్ టిక్కెట్‌లు రద్దు చేయడానికి అనుమతివ్వరు. పేపర్ టికెట్ పద్ధతిలో మాత్రం రద్దుకు అవకాశం ఉంటుంది. కియోస్క్‌లో టికెట్‌ను ప్రింట్ చేయకపోతే మొబైల్ అప్లికేషన్ ద్వారానే టికెట్ రద్దు చేసుకోవచ్చు. ఒకవేళ టికెట్‌ ప్రింట్‌ చేస్తే. ప్రింట్‌అవుట్ తర్వాత ఒక గంటలోపు యూటీఎస్‌ కౌంటర్‌లో మాత్రమే రద్దు చేయడానికి అనుమతి ఉంటుంది. రద్దు సమయంలో ఎలాంటి నగదు వాపసు ఇవ్వరు . క్లర్కేజ్ ఛార్జీని మినహాయించిన తర్వాత వాపసు మొత్తం.. వినియోగదారు ఆర్‌-వాలెట్‌లో ఆటోమేటిక్‌గా టాప్ అప్ చేస్తారు.

యూటీఎస్‌ యాప్‌లో రద్దు ఇలా..

  • యూటీఎస్‌ యాప్‌లోకి వెళ్లి, మీ ఆధారాలను ఉపయోగించి లాగిన్ చేయాలి. తర్వాత, ‘క్యాన్సిల్‌’ బటన్‌ను క్లిక్ చేయండి.
  • కొత్త మొబైల్ సైట్ ఓపెన్‌ అవుతుంది. ఇది రద్దు చేయడానికి అర్హత ఉన్న అన్ని టిక్కెట్‌లను చూపుతుంది.
  • ఫ్లాట్ క్యాన్సిలేషన్ ఛార్జీ రూ. 30. కాగా మీరు రూ. 30 కంటే తక్కువ విలువైన టికెట్‌లను కొనుగోలు చేసినట్లయితే, అవి ఈ విండోలో కనిపించవు. మీరు ఈ విండోలో చూపిన ‘క్యాన్సిల్‌ టికెట్‌’ బటన్‌పై క్లిక్ చేయాలి.
  • యాప్ మీ రద్దు నిర్ణయం గురించి నిర్ధారణ కోసం అడుగుతుంది. రద్దు ఛార్జీని తీసివేసిన తర్వాత రీఫండ్ మొత్తం చిన్న పాప్-అప్ బాక్స్‌లో కనిపిస్తుంది. తర్వాత ఓకే బటన్‌పై నొక్కా‍ల్సి ఉంటుంది.
  • కొత్త పాప్-అప్ సందేశం ఫ్లాష్ అవుతుంది. రద్దు రుసుమును తీసివేసిన తర్వాత మీరు ఎంత వాపసు పొందబోతున్నారో అది మీకు చూపుతుంది.

టికెట్‌ బుకింగ్‌ చార్జీలు ఇవి..

యూటీఎస్‌ యాప్‌ ఆర్‌-వ్యాలెట్‌ ద్వారా లావాదేవి చేస్తే మీకు సర్వీస్‌ చార్జీలు వర్తించవు. డిజిటల్‌ లావాదేవీలు ప్రోత్సహించడానికి భారతీయ రైల్వే ఆర్‌-వ్యాలెట్‌ని ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేయడంపై 3% బోనస్‌ను కూడా అందిస్తోంది. అలాగే దీనిలో పేమెంట్ల కోసం పేటీఎం, మొబిక్విక్‌, ఫ్రీచార్జ్‌, వివిధ డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్-బ్యాంకింగ్, యూపీఐ వంటి విభిన్న వాలెట్‌లను ఉపయోగించి చెల్లించవచ్చు. పేటీఎం, మొబిక్విక్‌, ఫ్రీచార్జ్‌ వంటి పేమెంట్‌ అగ్రిగేటర్లపై అదనపు చార్జీలు ఉండవు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..