ఆధార్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి ఒక గుర్తింపు. ఇది లేకపోతే మన దేశంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏ ప్రభుత్వ పథకం మంజూరు కావాలన్నా ఈ కార్డు ఉండాల్సిందే. బ్యాంక్ ఖాతా ప్రారంభించాలన్నా ఆధార్ నంబర్ ఉండాల్సిందే. ఇటీవల కాలంలో ఆన్ లైన్ లావాదేవీలు, ఆన్ లైన్ కొనుగోళ్లు అధికమవుతున్నాయి. దీనికి కూడా కొన్ని కంపెనీలు ఆధార్ అథంటికేషన్ అడుగుతున్నాయి. పలు ప్రభుత్వ పథకాలకు ఈ-కేవైసీ చేయడానికి ఆధార్ అవసరం అవుతుంది. అయితే ప్రతి దానికి ఆధార్ నంబర్ బయట పెట్టకుండా దాని స్థానంలో ఆధార్ వర్చువల్ ఐడీ(వీఐడీ)ని వినియోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఆధార్ వర్చువల్ ఐడీ అంటే ఏమిటి? దానిని ఎలా జనరేట్ చేయాలి? ఎలా వినియోగించుకోవాలి? తెలుసుకుందాం రండి..
ఆధార్ వర్చువల్ ఐడీ(వీఐడీ) అనేది తాత్కాలిక నంబర్. ఇది ఆధార్ కార్డుకు లింక్ అయి ఉంటుంది. ఇది 16 ర్యాండమ్ సంఖ్యలతో ఉంటుంది. ఏదైనా అథంటికేషన్, ఈ-కేవైసీ చేసే సమయంలో ఆధార్ కు బదులు ఈ వర్చువల్ ఐడీ ని వినియోగించుకోవచ్చు.
కొత్త ఆధార్ వర్చువల్ ఐడీ లేదా ఇప్పటికే ఉన్న వీఐడీ లను తిరిగి పొందడానికి పలు ఆప్షన్లను యూఐడీఏఐ తీసుకొచ్చింది. అందుకోసం ఎస్ఎంఎస్, ఈ-ఆధార్, ఎం-ఆధార్ మొబైల్ అప్లికేషన్, యూఐడీఏఐ వెబ్ సైట్ లను వినియోగించుకోవచ్చు. వర్చువల్ ఐడీ కావాలనుకొనే వారు ఆధార్ హెల్ప్ లైన్ నంబర్ 1947కి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా వర్చువల్ ఐడీని తిరిగి పొందొచ్చు. RVID అని టైప్ చేసి ఆధార్ నంబర్ లోని చివరి నాలుగు నంబర్లను జోడించి ఆధార్ తో లింక్ అయ్యి ఉన్న ఫోన్ నంబర్ నుంచి 1947 కు మెసేజ్ పంపాలి.
ఆధార్ వర్చువల్ ఐడీని రీ జనరేట్ చేయొచ్చు. కానీ అందుకు టైం లిమిట్ ఉంది. కనీస సమయం దాటిన తర్వాత మాత్రమే కొత్త ఐడీ జనరేట్ అవుతుంది. కనీస వ్యాలిడిటీ సమయం ఒక రోజు ఉంటుంది. మీరు కొత్త దానికి కోసం ప్రయత్నించినప్పుడు పాతది ఇన్ యాక్టివేట్ అయిపోయి కొత్తది జనరేట్ అవుతుంది. ఒకవేళ మీరు కొత్తది కాకుండా పాతదే మళ్లీ కావాలనుకొంటే అందుకోసం RVID అని టైప్ చేసి ఆధార్ కార్డులోని చివరి నాలుగు నంబర్లను జోడించి 1947 కు ఆధార్ కు లింక్ అయ్యి ఉన్న నంబర్ నుంచి మెసేజ్ చేస్తే సరిపోతోంది.
ఆధార్ వర్చువల్ ఐడీకి ఎక్స్ పైరీ పిరియడ్ ఏమి లేదు. వర్చువల్ ఐడీ ఒక్కసారి జనరేట్ అయితే అదే మళ్లీ వినియోగదారుడు కొత్త దానికి కోసం అర్జీ పెట్టుకునే వరకూ యాక్టివ్ గానే ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..