cyber crime: అందమైన అమ్మాయి డీపీతో వాట్సాప్‌ మెసేజ్‌లు వస్తున్నాయా.? స్పందిస్తే..

|

Sep 19, 2024 | 10:43 AM

ముఖ్యంగా యువతను, అప్పటికే ఉద్యోగం చేస్తున్న వారిని టార్గెట్ చేసుకొని ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి వాటిని చేయడం లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో పేజీలను ఓపెన్‌ చేసి లైక్‌ చేస్తే చాలు అకౌంట్‌లోకి డబ్బులు వచ్చేస్తాయంటూ దర్జాగా దోచేస్తున్నారు. ఇంతకీ ఇలాంటి నేరాలు ఎలా జరుగుతున్నాయి.? వీటి బారిన పడకుండా ఉండాలంటే...

cyber crime: అందమైన అమ్మాయి డీపీతో వాట్సాప్‌ మెసేజ్‌లు వస్తున్నాయా.? స్పందిస్తే..
Cyber Crime
Follow us on

కాలం మారింది, మారిన కాలంతో పాటు టెక్నాలజీ మారింది. అయితే ఈ టెక్నాలజీతో పాటు నేరాల తీరు కూడా మారిపోయింది. మనిషి అత్యాశను ఆసరగా చేసుకొని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒక చిన్న మెసేజ్‌తో డబ్బులను కాజేస్తున్నారు. అదేదో హ్యాకింగ్ చేసిన డబ్బులను కాజేయడం కాదు, నేరుగా మీరు డబ్బులు ఇచ్చేలా చేస్తున్నారు సైబర్‌ కేటుగాళ్లు. ప్రస్తుతం ఇలాంటి సైబర్‌ నేరానికి సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ముఖ్యంగా యువతను, అప్పటికే ఉద్యోగం చేస్తున్న వారిని టార్గెట్ చేసుకొని ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి వాటిని చేయడం లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో పేజీలను ఓపెన్‌ చేసి లైక్‌ చేస్తే చాలు అకౌంట్‌లోకి డబ్బులు వచ్చేస్తాయంటూ దర్జాగా దోచేస్తున్నారు. ఇంతకీ ఇలాంటి నేరాలు ఎలా జరుగుతున్నాయి.? వీటి బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా తెలియని నెంబర్‌ నుంచి వాట్సాప్‌లో హాయ్‌ అనే మెసేజ్‌ వస్తుంది. ఒక అందమైన అమ్మాయి డీపీ ఉన్న వాట్సాప్‌ నెంబర్‌ నుంచి ఈ మెసేజ్‌ వస్తుంది. హాయ్‌ అని రిప్లై ఇవ్వగానే మీరు పార్ట్ టైమ్‌ జాబ్‌ కోసం చూస్తున్నారా.? సింపుల్‌ ప్రాసెసతో డబ్బులు సంపాదించవచ్చని చెబుతారు. ఓకే అనగానే ఇక అసలు కథ మొదలవుతుంది. వెంటనే ప్రాసెస్‌ను వివరిస్తారు. ఇందులో భాగంగా మొదట ఒక యూట్యూబ్‌ లేదా ఇన్‌స్టా పేజ్‌ లింక్‌ను పంపిస్తారు. వాటిని లైక్‌ చేసి స్క్రీన్‌ షాట్స్‌ను పంపించమని అడుగుతారు. ఒక్కో లైక్‌కు రూ. 50 ఇస్తామని చెబుతారు.

స్క్రీన్ షాట్స్‌ పంపించిన వెంటనే రూ. 150 వచ్చాయని ఈ మొత్తాన్ని పొందేందుకు తమ హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ను సంప్రదించాలని ఒక టెలిగ్రామ్‌ నెంబర్‌ ఇస్తారు. టెలిగ్రామ్‌లో బ్యాంక్‌ అకౌంట్‌, ఆధార్‌ వివరాలు అడుగుతారు. వెంటనే అకౌంట్‌లోకి రూ. 150 పంపిస్తారు. ఇక ఆ తర్వాత ఈ టాస్క్‌లు ఇలాగే కొనసాగించాలంటే అకౌంట్‌ ఓపెన్‌ చేసుకోవాలని ఒక లింక్‌ను పంపిస్తారు. లింక్‌ క్లిక్‌ చేయగానే వెబ్‌సైట్ ఓపెన్‌ అవుతుంది. అందులో రిజిస్టర్‌ చేసుకోగానే అకౌంట్ ఓపెన్‌ అవుతుంది.

తర్వాత టాస్క్‌లు ఆడాలంటే టాస్క్‌లను కొనుగోలు చేయాలని చెబుతారు. రూ. 500 పెట్టి టాస్క్‌ను కొనుగోలు చేస్తే కొన్ని టాస్క్‌లు ఇస్తారు. వాటిని పూర్తి చేయగానే కొంత అమౌంట్ యాడ్‌ చేస్తారు. ఈ మొత్తాన్ని బ్యాంక్‌ అకౌంట్‌లోకి విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఇక ఇక్కడే అసలు సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత పెట్టుబడిని పెంచమని చెబుతారు. కానీ విత్‌డ్రా ఆప్షన్‌ను మాత్రం ఇవ్వరు. పెద్ద మొత్తంలో బ్యాలెన్స్‌ చూపిస్తుంది కానీ విత్‌డ్రా చేసుకోవడానికి ఆప్షన్‌ ఉండదు. విత్‌డ్రా చేసుకోవాలంటే ఇంకా పెట్టుబడి పెట్టాలని మభ్య పెడుతుంటారు. ఇలా వెనకా ముందు ఆలోచించకుండా పెట్టుబడి పెట్టుకుంటూ పోతూనే ఉంటారు. తీరా కొన్ని రోజుల తర్వాత తాము మోసపోయామని తెలిసి బోరు మంటుంటారు. ఇలా మోసపోయిన వారిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కూడా ఉండడం గమనార్హం.

మోసాల బారిన పడకుండా ఉండాలంటే..

సైబర్‌ నేరస్తులకు మన అత్యాశే పెట్టుబడి. కేవలం లింక్స్‌ లైక్‌ చేస్తే డబ్బులు ఎందుకు ఇస్తారన్న విషయాన్ని గమనించకపోవడం ఇలాంటి మోసాల బారిన పడేందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అందుకే తెలియని నెంబర్స్‌ నుంచి మెసేజ్‌లు వస్తే స్పందించకూడదని సూచిస్తున్నారు. అలాగే గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంక్‌ అకౌంట్స్‌, పాన్‌ కార్డ్‌ వివరాలను తెలియజేయకూడదని చెబుతున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..