
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రవేశపెట్టింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కలిగిన రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఇతర కంపెనీల రీఛార్జ్ ధరలతో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మరో చవకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చి కస్టమర్లకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ ప్లాన్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ పేరు భారత్ కనెక్ట్ 26. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది. కొన్ని రోజుల పాటు ఈ కొత్త ప్లాన్ అందుబాటులో ఉంటుంది. దీంతో ఈ లోపు రీఛార్జ్ చేసుకుంటే బెనిఫిట్ పొందవచ్చు.
బీఎస్ఎన్ఎల్ భారత్ కనెక్ట్ 26 ప్లాన్ ధర రూ.2626గా ఉంది. ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 2.6జీబీ డేటా వాడుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఇతర టెలికాం ఆపరేటర్లు ఏడాది చెల్లుబాటు అయ్యే వార్షిక ప్లాన్లలో 2.5 జీబీ డేటా మాత్రమే అందిస్తోంది. కానీ బీఎస్ఎన్‌ఎల్ ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అంతకంటే ఎక్కువ డేటా అందిస్తోంది.
ఈ ప్లాన్ జనవరి 24వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఫిబ్రవరి 24 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ నెల రోజుల్లో ఈ ప్లాన్ సెలక్ట్ చేసుకుని రీఛార్జ్ చేసుకుంటే బెనిఫిట్స్ పొందవచ్చు. ఆ తర్వాత ఈ ప్లాన్ అందుబాటులో ఉండదు. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్ రెండు వార్షిక ప్లాన్లను అందిస్తోంది. ఇప్పుడు మరో ప్లాన్ ప్రవేశపెట్టడంతో మూడు వార్షిక ప్లాన్లు అందుబాటులోకి వచ్చాయి.
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ ధర రూ.2399గా ఉంది. ఇది 365 రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది. రోజుకు 2.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌ల సౌకర్యం ఉంటుంది. రోజువారీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఇక మరో వార్షిక ప్లాన్ రూ.2799ని బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది. ఇది రోజుకు 3జీబీ డేటా అందిస్తుంది. ఈ లిమిట్ అయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు చేసుకోవచ్చు.