ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్ పెట్టి గంటల కొద్ది వాడుతున్నారా? ఎంత డేంజరో తెలుసుకోండి!
ల్యాప్‌టాప్‌ను ఛార్జింగ్‌లో వాడటం బ్యాటరీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆధునిక బ్యాటరీలు పవర్ నియంత్రించినా, నిరంతర ఛార్జింగ్, అధిక వేడి బ్యాటరీ జీవితాన్ని తగ్గిస్తాయి. 20-80 శాతం మధ్య ఛార్జ్ ఉంచడం, మంచి వెంటిలేషన్, ఒరిజినల్ ఛార్జర్ వాడటం వంటి జాగ్రత్తలు పాటిస్తే ల్యాప్‌టాప్ పనితీరు మెరుగ్గా ఉంటుంది.

ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ల్యాప్‌టాప్‌లు రోజువారీ జీవితంలో కీలక భాగంగా మారాయి. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాసుల నేపథ్యంలో చాలా మంది ల్యాప్‌టాప్‌ను ఛార్జింగ్‌కు పెట్టి గంటల కొద్దీ వాడుతున్నారు. అయితే ఇది సురక్షితమేనా? దీనివల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయో తెలుసుకోవడం అవసరం. నిపుణుల ప్రకారం.. ఆధునిక ల్యాప్‌టాప్‌లలో ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీలు పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా పవర్ సరఫరాను నియంత్రించే విధంగా రూపొందించబడ్డాయి. కాబట్టి కొంతవరకు ఛార్జింగ్‌లో వాడటం ప్రమాదకరం కాదు. అయితే దీర్ఘకాలం పాటు నిరంతరం ప్లగ్‌లో ఉంచి వాడటం వల్ల బ్యాటరీ ఆరోగ్యం క్రమంగా దెబ్బతినే అవకాశం ఉంది.
ప్రత్యేకంగా గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి భారీ పనులు చేస్తూ ఉండగా ల్యాప్‌టాప్ వేడెక్కుతుంది. అదే సమయంలో ఛార్జింగ్ కొనసాగితే ఉష్ణోగ్రత మరింత పెరిగి, బ్యాటరీ లైఫ్ తగ్గే ప్రమాదం ఉంది. అధిక వేడి వల్ల అంతర్గత భాగాలపై కూడా ప్రభావం పడుతుంది. ఇంకా ఎప్పుడూ 100 శాతం ఛార్జ్ వద్ద ఉంచడం కూడా బ్యాటరీపై ఒత్తిడిని పెంచుతుంది. నిపుణులు సాధారణంగా 20 శాతం నుండి 80 శాతం మధ్య బ్యాటరీని ఉంచడం మంచిదని సూచిస్తున్నారు. అప్పుడప్పుడు ప్లగ్ తీసి బ్యాటరీపై మాత్రమే ఉపయోగించడం ద్వారా బ్యాటరీ పనితీరును నిలబెట్టుకోవచ్చు.
ల్యాప్‌టాప్ వెంటిలేషన్ కూడా చాలా ముఖ్యం. గాలి సరిగా వెళ్లేలా కఠినమైన ఉపరితలంపై ఉంచి వాడాలి. బెడ్, సోఫా వంటి ప్రదేశాల్లో వాడితే వేడి ఎక్కువగా నిల్వ అవుతుంది. అలాగే ఒరిజినల్ ఛార్జర్‌ను మాత్రమే ఉపయోగించడం మంచిది. ల్యాప్‌టాప్‌ను ఛార్జింగ్‌లో వాడటం పూర్తిగా ప్రమాదకరం కాకపోయినా, దీర్ఘకాలంలో బ్యాటరీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. సరైన జాగ్రత్తలు పాటిస్తే ల్యాప్‌టాప్ పనితీరు మెరుగ్గా ఉండటమే కాకుండా దీర్ఘకాలం ఉపయోగించుకోవచ్చు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
