Artificial intelligence: ఏఐతో ఇంత ప్రమాదమా.. ఫేక్ ఆధార్‌లతో షాక్..!
ఆధునిక కాలంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగి, అనేక సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. సులభంగా, శరవేగంగా అన్ని రకాల పనులు చేసుకునే వెసులుబాటు లభించింది. ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. దీని ద్వారా అనేక సమస్యలను చిటికెలో పరిష్కరించుకునే వీలు కలిగింది. ఇదే సమయంలో ఏఐతో అనేక అనర్థాలు జరుగుతున్నాయనే వార్తలు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ టెక్నాలజీని ఉపయోగించి కొందరు నకిలీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు తయారు చేస్తున్నారు.

దేశంలో ఆధార్ కార్డుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పౌరుడిగా గుర్తింపుతో పాటు అన్ని ప్రభుత్వ పథకాలను పొందటానికి ముఖ్యమైన పత్రంగా మారింది. ఇక ఆర్థిక పరమైన వ్యవహారాలన్నింటికి పాన్ కార్డు తప్పనిసరి. వీటిని ప్రభుత్వం ప్రజలకు మంజూరు చేస్తుంది. కానీ కొందరు చాట్ జీపీటీతో నకిలీ ఆధార్, పాన్ కార్డులు తయారు చేస్తున్నారు. చాట్ జీపీటీకి మూలమైన ఓపెన్ ఏఐ ఇటీవల జీపీటీ – 40 ఇమేజ్ జనరేషన్ ను ఫీచర్ ను విడుదల చేసింది. దీన్ని ఉపయోగించి నెటిజన్లు గిబ్లీ తరహా ఇమేజ్ లను రూపొందించుకుని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అప్ లోడ్ చేస్తున్నారు. ఇంకొందరు ఈ టెక్నాలజీతో నకిలీ ఆధార్ కార్డులు రూపొందించడం ఆందోళనకు కలిగిస్తోంది.
చాట్ జీపీటీని ఉపయోగించి తయారు చేసిన నకిలీ ఆధార్, పాన్ కార్డులను కొందరు నెటిజన్లు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో పోస్టు చేశారు. ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట, ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్ మన్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ పేరుతో వీటిని తయారు చేశారు. వాటిపై క్యూఆర్ కోడ్, ఆధార్ కార్డు నంబర్లు, చిరునామా, ఇతర వివరాలు స్పష్టంగా ఉన్నాయి. అచ్చం అసలు ఆధార్ కార్డును పోలి ఉండేలా నకిలీ కార్డును రూపొందించారు.
కొందరు సరదాగా ఈ నకిలీ కార్డులను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నప్పటికీ, ఇదే టెక్నాలజీ నేరగాళ్ల చేతిలోకి వెళితే అనేక అనర్థాలు కలుగుతాయనే ఆందోళనలు నెలకొన్నాయి. ఆధార్ ఇమేజ్ ను తయారు చేయడం చాట్ జీపీటీకి చాాలా సులువైన పనే. కానీ దానికి కావాల్సిన ఫొటోలు, ఇతర వివరాలు ఎక్కడి వస్తున్నాయన్నదే ఇప్పుడు ప్రధాన సమస్య. దీని వల్ల పౌరుల వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగే ప్రమాదం కూడా ఉంది.
నిజమైన ఆధార్ కార్డు, నకిలీ కార్డుల మధ్య వ్యత్సాసాలను తెలుసుకోవడానికి కొన్ని విషయాలను నిశితంగా పరిశీలించాలి. ముందుగా పాస్ పోర్టు ఫొటోను గమనించాలి. జెన్యూస్ నుంచి తీసుకున్న ఫొటో అయినప్పటికీ ఏఐ ఇమేజ్ తేడా ఉంటుంది. రెండు కార్డుల్లోని హిందీ, ఇంగ్లిషు అక్షరాలను చూడండి. ఆధార్ లోగోలు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే ముద్రలను పరిశీలించాలి. క్యూఆర్ కోడ్ అధికారికమైనదా, లేదో తెలుసుకోవడానికి దాన్ని స్కాన్ చేయండి. మైఆధార్.యూఐడీఏఐ.జీవోవీ.ఇన్ లోకి వెళ్లి ఆధార్ కార్డును వెరిఫై చేసుకోండి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి