
భారత ఆటోమొబైల్ రంగాన్ని బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ మోడల్ వేగంగా మార్చేస్తుంది. వాహనం కొనుగోలు వ్యయంలో అత్యధిక భాగాన్ని ఆక్రమించే బ్యాటరీని సబ్‌స్క్రిప్షన్ పద్ధతిలోకి తీసుకురావడంతో ఎలక్ట్రిక్ కార్ల ప్రారంభ ధరలు గణనీయంగా తగ్గాయి. బడ్జెట్ శ్రేణిలో కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటున్న నాలుగు బెస్ట్ ఎలక్ట్రిక్ మోడళ్ల గురించి తెలుసుకోవడం అందరికీ ముఖ్యమే. అందులో ఫస్ట్‌ది టాటా టియాగో ఈవీ. ఎంట్రీ లెవల్ ఈవీ సెగ్మెంట్‌లో అత్యధిక ఆదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగో ఈవీ. BaaS పద్ధతిలో ఇది కేవలం రూ.4.69 లక్షల ప్రారంభ ధరకే లభిస్తుండగా సాధారణ ఎక్స్ షోరూమ్ కొనుగోలు ధర రూ. 6.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ కారు 19.2 kWh, 24 kWh బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. పూర్తి ఛార్జ్‌పై ఇది 293 కిలోమీటర్ల వరకు MIDC డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది. ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా మరియు ESC వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
నగరాల రద్దీ రహదారులపై సులువుగా ప్రయాణించడానికి, రోజువారీ అవసరాల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న కాంపాక్ట్ ఈవీ ఎంజీ కామ్యూట్ ఈవీ. BaaS విధానం కింద దీని ప్రారంభ ధర రూ. 4.99 లక్షలుగా ఉండగా, సాధారణ ఎక్స్ షోరూమ్ మోడల్ ధర రూ.7 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 17.3 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. క్యాబిన్ లోపల రెండు 10.25 ఇంచుల డిజిటల్ స్క్రీన్‌లు, iSmart కనెక్టెడ్ టెక్నాలజీ, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
తక్కువ బడ్జెట్‌లో మైలేజ్, ఎస్‌యూవీ తరహా లుక్, రోడ్ ప్రెజెన్స్ కోరుకునే వారికి టాటా పంచ్ ఈవీ ఒక అద్భుతమైన ఆప్షన్. BaaS ప్లాన్‌లో రూ.6.49 లక్షల నుండి ఇది అందుబాటులో ఉండగా, సాధారణ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.9.69 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది 25 kWh, 35 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో వస్తుంది. ఇది గరిష్ఠంగా 421 కిలోమీటర్ల వరకు అత్యుత్తమ డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది. క్యాబిన్‌లో వెంటిలేటెడ్ సీట్లు, సన్‌రూఫ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేతో పాటు భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS సెక్యూరిటీ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఫీచర్లు ఉన్నాయి.
విశాలమైన క్యాబిన్ స్పేస్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, రగ్గడ్ SUV శైలి కోరుకునే వారి కోసం సిట్రోయెన్ ఈసీ3 అందుబాటులోకి వచ్చింది. BaaS పథకంలో దీని ప్రారంభ ధర రూ. 8.49 లక్షలుగా ఉంటే సాధారణ ఎక్స్ షోరూమ్ మోడల్ ధర రూ.11.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇందులో ఉన్న 29.2 kWh బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ARAI సర్టిఫైడ్ 320 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. లోపల 10.2 ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్ప్లే, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, TPMS వంటి భద్రతా సదుపాయాలు ఉన్నాయి.