ఏసీ vs కూలర్: ఏది వాడితే తక్కువ కరెంట్ బిల్ వస్తుంది..? ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..
AC vs Cooler: బయటకు వెళ్తే భానుడి భగభగలు, ఇంట్లో ఉంటే ఉక్కపోత.. ఈ సెగ నుంచి తప్పించుకోవడానికి ఏసీలు, కూలర్లే దిక్కు. అయితే, చల్లదనం ఏమో కానీ, నెల ముగిశాక వచ్చే కరెంట్ బిల్లు చూస్తే సామాన్యుడికి గుండె గుభేల్ మంటోంది. అసలు ఏసీ, కూలర్లలో ఏది వాడితే జేబుకు పొదుపు..? ఈ రెండింటిలో ఏది ఎక్కువ కరెంట్ వాడుతుందో లెక్కలతో సహా తెలుసుకుందాం..

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ వేడి నుండి ఉపశమనం పొందేందుకు సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు అందరూ ఏసీలు, కూలర్లపైనే ఆధారపడుతున్నారు. అయితే చల్లదనం ఏమో కానీ, నెల ముగిశాక వచ్చే కరెంట్ బిల్లు చూస్తుంటే సామాన్యుడికి చెమటలు పడుతున్నాయి. అసలు ఏసీ, కూలర్లలో ఏది వాడితే ఎంత బిల్లు వస్తుంది? ఏది మన జేబుకు తక్కువ భారాన్ని కలిగిస్తుందో గణాంకాలతో సహా తెలుసుకుందాం..
కూలర్
మీరు పాతకాలపు మెటల్ బాడీ ఎయిర్ కూలర్ వాడుతున్నట్లయితే, అది గంటకు సగటున 400 వాట్ల విద్యుత్తును వినియోగిస్తుంది. మీరు రోజుకు 12 గంటలు కూలర్ వాడితే, రోజుకు 4.8 యూనిట్ల కరెంట్ ఖర్చవుతుంది. నెలకు సగటున 150 యూనిట్ల విద్యుత్ దీని కోసం ఖర్చవుతుంది. ప్రస్తుతం ఒక యూనిట్ ధర సగటున రూ.7 అనుకుంటే, కేవలం కూలర్ వల్ల నెలకు రూ.1,050 అదనంగా బిల్లులో చేరుతుంది. ఇది కేవలం గాలిని చల్లబరుస్తుంది, విద్యుత్ వినియోగం చాలా తక్కువ. నిర్వహణ ఖర్చులు కూడా స్వల్పమే.
ఎయిర్ కండిషనర్
మనం ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా వాడుతున్న 1.5 టన్ 5 స్టార్ ఏసీని ఉదాహరణగా తీసుకుంటే.. ఇది గంటకు సుమారు 840 వాట్ల విద్యుత్తును వినియోగిస్తుంది. దీనిని రోజుకు 12 గంటలు నడిపితే, రోజుకు ఏకంగా 10 యూనిట్ల కరెంట్ ఖర్చవుతుంది. నెలకు సుమారు 300 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అంటే కూలర్ వాడకం కంటే ఇది సరిగ్గా రెండింతలు ఎక్కువ. యూనిట్‌కు రూ.7 చొప్పున లెక్కిస్తే, ఏసీ వల్ల నెలకు మీ కరెంట్ బిల్లుకు అదనంగా రూ.2,100 భారం పడుతుంది. ఒకవేళ మీరు 3-స్టార్ ఏసీ వాడితే లేదా ఇన్వర్టర్ లేని పాత ఏసీ వాడితే ఈ బిల్లు నెలకు రూ.3,000 నుండి రూ.4,000 వరకు వెళ్లే ప్రమాదం ఉంది.
ఏది వాడితే జేబుకు పొదుపు..?
ఈ లెక్కలను పరిశీలిస్తే, కూలర్ వాడకం వల్ల ఏసీతో పోలిస్తే సగం ఖర్చు మాత్రమే అవుతుంది. కానీ, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటినప్పుడు కూలర్ ఇచ్చే చల్లదనం సరిపోదు. ముఖ్యంగా గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కూలర్ వల్ల ఉక్కపోత పెరుగుతుంది. అప్పుడు ఏసీ ఒక్కటే సరైన పరిష్కారం.
కరెంట్ బిల్లును ఎలా తగ్గించుకోవాలి..?
ఏసీ లేదా కూలర్ ఏది వాడినా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బిల్లు తగ్గించుకోవచ్చు.
ఏసీ టెంపరేచర్: ఏసీని ఎప్పుడూ 24 నుండి 26 డిగ్రీల మధ్య ఉంచండి. 18°C లో పెడితే కంప్రెసర్ నిరంతరం తిరిగి బిల్లు విపరీతంగా పెరుగుతుంది.
కూలర్ నిర్వహణ: కూలర్ ప్యాడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి. నీరు సరిగ్గా పంప్ అయ్యేలా చూస్తే చల్లటి గాలి వస్తుంది.
సీలింగ్ ఫ్యాన్ వాడకం: ఏసీ ఆన్ చేసినప్పుడు తక్కువ స్పీడ్‌లో సీలింగ్ ఫ్యాన్ వాడితే చల్లటి గాలి గది అంతా త్వరగా వ్యాపిస్తుంది. దీనివల్ల ఏసీపై లోడ్ తగ్గుతుంది.
ద్వారాలు, కిటికీలు: ఏసీ ఆన్ చేసినప్పుడు గదిలోకి బయటి గాలి రాకుండా డోర్లను, కిటికీలను గట్టిగా మూసి ఉంచండి.
మీరు ఆర్థికంగా పొదుపు చేయాలనుకుంటే కూలర్ ఉత్తమ మార్గం. కానీ, తీవ్రమైన వేడి నుండి సంపూర్ణ ఉపశమనం కావాలనుకుంటే ఏసీ తప్పనిసరి. అయితే ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఏసీ వాడితే చల్లదనంతో పాటు జేబుకు చిల్లు పడకుండా చూసుకోవచ్చు.
