
ముంబాయి బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ అంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎందుకంత కోపం? కోపం ఉందని భ్రమపడుతున్నామా? సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్న వీడియోలో నిజంగానే సూర్యకుమార్ దగ్గరకు వెళ్లి కోహ్లీ స్లెడ్జింగ్ చేశాడా? అసలేం జరిగింది? నిన్న అబుదాబిలో ముంబాయి- బెంగళూరు తలపడ్డాయి కదా! ఆ మ్యాచ్‌లో ముంబాయి ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడి 43 బంతుల్లోనే మెరుపు వేగంతో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.. ముంబాయికి సునాయాస విజయాన్ని అందించాడు.. అలా తన జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు.. అయితే 13వ ఓవర్ పూర్తయ్యాక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు సారథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ దగ్గరకు వెళ్లాడు.. అప్పుడే సూర్యకుమార్‌ను ఏదో అన్నాడు.. ఇదంతా సోషల్ మీడియాలలో వైరల్ అవుతోన్న వీడియోలో కనిపిస్తోంది.. డేల్ స్టెయిన్ వేసిన 13వ ఓవర్‌లో ఒక లెగ్‌బై వచ్చింది.. ఆ తర్వాత సూర్యకుమార్ మూడు బౌండరీలు బాదాడు.. అప్పటికే అతను 40 పరుగులు చేశాడు.. ఆ దశలో ముంబాయి మూడు వికెట్లకు 99 పరుగులు చేసి గెలుపు దిశగా అడుగులు వేస్తోంది.. మరోవైపు ఆ సమయంలో బెంగళూరు విజయావకాశాలను కూడా కొట్టిపారేయ్యడానికి లేదు.. సూర్యకుమార్ క్రీస్‌లో ఉంటే ప్రమాదకరమని అనుకున్నాడో ఏమో కానీ గబగబా సూర్యకుమార్ దగ్గరకు వెళ్లాడు కోహ్లీ.. అప్పుడు సూర్యకుమార్ కూడా కోహ్లీని చాలా లైట్ తీసుకున్నట్టు వీడియోలో కనిపించింది. స్లెడ్జింగ్ చేశాడో లేదో కానీ కోహ్లీ ఇంత పని చేస్తాడా అంటూ నెటిజన్లు మాత్రం తెగ కామెంట్లు చేస్తున్నారు. నిజం సూర్యకుమార్‌కు తెలుసు!!