స్పోర్ట్స్ ఫర్ ఆల్ (SFA) ఛాంపియన్‌షిప్ 2024 పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని పలు వేదికల్లో యువ క్రీడాకారులు ఆసక్తిగా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ‘ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్’ ప్రచారం కోసం దేశంలోని అతిపెద్ద గ్రాస్‌రూట్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన SFAతో TV9 నెట్‌వర్క్ భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారుల ప్రతిభను ప్రదర్శించడానికి సువర్ణావకాశాన్ని అందిస్తుంది. దీనిలో భాగంగా TV9 నెట్‌వర్క్.. బుండెస్లిగా, DFB-పోకల్, ఇండియా ఫుట్‌బాల్ సెంటర్, IFI, BVB, RIESPOతో సహా పలు కీలక సంస్థలతో కలిసి ఈ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తుంది.
SFA ఛాంపియన్‌షిప్ 2024 పోటీల్లో 11వ రోజు కూడా థ్రిల్లింగ్ కొనసాగింది. వివిధ క్రీడలలో బాలబాలికలు హోరాహోరీగా తలపడ్డారు. మరో 3 రోజుల్లో ఛాంపియన్‌షిప్స్ ముగియనున్నాయి. దీంతో అథ్లెట్లు తాము చదువుతున్న స్కూళ్లు గర్వించేలా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. గచ్చిబౌలి స్టేడియంలో బాలుర U-10 హ్యాండ్‌బాల్ ఫైనల్ హోరాహోరీగా జరిగింది. ఇక్కడ విఘ్నన్స్ బో ట్రీ స్కూల్‌పై జనప్రియ హైస్కూల్ విజయం సాధించి విజేత టైటిల్‌ను కైవసం చేసుకుంది. మరోవైపు బాలికల U-14 వాలీబాల్ ఫైనల్‌లో విగ్నాన్స్ బో ట్రీ స్కూల్‌పై బోలారం ఆర్మీ పబ్లిక్ స్కూల్ విజయం సాధించి స్వర్ణం గెలుచుకుంది. ది క్రీక్ ప్లానెట్ స్కూల్‌కి చెందిన విద్యార్ధులు స్విమ్మింగ్ పూల్ కాంపిటీషన్‌లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచారు. హర్షిత వర్మ భూపతిరాజు, తేజా రామ్ సామినేని ఇద్దరూ వరుసగా U-16 బాలికలు, బాలుర 100 మీటర్ల బటర్‌ఫ్లై స్ట్రోక్‌లో పసిడి పతకం సాధించారు. బాస్కెట్‌బాల్ కోర్టులో బాలికల U-14 సెమీఫైనల్స్, U-18 రౌండ్ 1తో రౌండ్‌లు ముందుకు సాగాయి. ఫుట్‌బాల్ బాలికల U-10 సెమీఫైనల్స్‌లో ఉత్కంఠ భరితంగా పోటీలు జరిగాయి. హ్యాండ్‌బాల్ బాలుర U-16, U-18 సెమీఫైనల్ మ్యాచ్‌లు కూడా హోరాహోరీగా జరిగాయి.
శ్రీ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన U-17 బాలికల కబడ్డీ పోటీలు ఆసక్తిగా జరిగాయి. ఇరు జట్లు క్వార్టర్ ఫైనల్‌లో అత్యుత్తమ ప్రతిభకనబరిచాయి. ఛాంపియన్‌షిప్ పోటీలు ముగింపుకు చేరుకోవడంతో పలు స్కూళ్లు లీడర్‌బోర్డ్‌ను కేవసం చేసుకోవడానికి, అగ్రస్థానంలో నిలవడానికి గట్టిగానే తలపడుతున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన క్రీడల్లో నిజాంపేటకు చెందిన విఘ్నన్స్ బో ట్రీ స్కూల్ అధిక పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఛాంపియన్‌షిప్ ముగియడానికి ఇంకా 3 రోజులు ఉన్నందున చివరికి టైటిల్ ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
కాగా ఈ ఏడాది హైదరాబాద్ వేదికగా జరుగుతున్న SFA ఛాంపియన్‌షిప్స్‌లో 920 పాఠశాలల నుంచి దాదాపు 23 వేల మంది అథ్లెట్లు 22 క్రీడాంశాలలో పోటీ పడుతున్నారు. ఛాంపియన్‌షిప్‌లు అక్టోబరు 28వ తేదీతో ముగుస్తాయి. ఇందులో విజేతలుగా నిలిచిన యువ క్రీడాకారులకు వచ్చే ఏడాది ప్రారంభంలో జర్మనీలో సత్కరించనున్నారు.