Selfie with Elephant: అడవి ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు యత్నం.. ఆగ్రహించిన గజరాజు కసపిస తొక్కి చంపేసింది!
అడవిలోకి కేబుల్ వర్క్ కోసం వెళ్లిన ముగ్గురు కూలీలు అనుకోని ఆపదలో పడ్డారు. పని మధ్యలో వదిలేసి అడవిలోని ఏనుగులను చూసేందుకు వెళ్లారు. ఇంతలో వారికి ఓ గజ ఏనుగు కనిపించడంతో దూరం నుంచి చూసి రాడానికి బదులు.. దానితో సెల్ఫీ దిగుదామని అనుకున్నారు. అసలే అది అడవి ఏనుగు.. వీళ్ల పిచ్చిపనికి పిచ్చ కోపం వచ్చిందో ఏమో.. ఒక్కసారిగా వీరి పైకి పరుగు తీసింది..
పూణె, అక్టోబర్ 25: అడవిలోకి కేబుల్ వర్క్ కోసమని ముగ్గురు కూలీలు వెళ్లారు. అయితే అక్కడ వారికి ఓ వైల్డ్ ఏనుగు కనిపించడంతో దానితో సెల్ఫీ దిగేందుకు యత్నించారు. కానీ ఏనుగు రియాక్షన్ వాళ్లస్సలు ఊహించలేదు. ఒక్కసారిగా అది వారిపై దాడిచేసింది. ఓ క్రమంలో ఓ వ్యక్తిని తొక్కి చంపింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలిలోని అబాపూర్ అడవుల్లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
శ్రీకాంత్ రామచంద్ర సాత్రే (23) తన ఇద్దరు స్నేహితులతో కలిసి నవేగావ్ నుంచి గడ్చిరోలి జిల్లాలో కేబుల్ లేయింగ్ పని కోసం వచ్చారు. అయితే వారు ముట్నూర్ అటవీ ప్రాంతంలోని అబాపూర్ అటవీప్రాంతంలో ఏనుగులను చూడాలని అనుకున్నారు. గతంలో అక్కడ పలుమార్లు ఏనుగులు కనిపించాయి కూడా. ఈ క్రమంలో చిట్టగాండ్ – గడ్చిరోలి అటవీ ప్రాంతం నుంచి అడవి ఏనుగు ఒకటి బయటకు వచ్చినట్లు వారికి తెలిసిందే. అబాపూర్ అటవీ ప్రాంతంలో ఆ ఏనుగు సంచరిస్తున్నట్లు తెలిసుకున్న ఆ ముగ్గురు స్నేహితులు.. ఆ ఏనుగును చూసేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం తన ఇద్దరు స్నేహితులతో కలిసి శ్రీకాంత్ అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు.
అక్కడ వాతావరణాన్ని ఆస్వాదిస్తుండగా.. వారికి అడవి ఏనుగు ఒకటి కనిపించింది. వారిలో శ్రీకాంత్ దూరం నుంచి ఏనుగుతో సెల్ఫీ దిగాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఆగ్రహించిన గజరాజు వారిని చాలా దూరం తరుముతూ వెంబడించింది. ఏనుగు బారి నుంచి మిగతా ఇద్దరు ఎలాగోలా తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ శ్రీకాంత్ మాత్రం దొరికిపోయాడు. అతడిపై దాడి చేసిన ఏనుగు తొండంతో కొడుతూ.. కిందపడేసి కాలితో తొక్కేసింది. ఈ ఘటనలో శ్రీకాంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిగతా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. శ్రీకాంత్ మృతికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుందా.. లేదా.. అనే దానిపై ఇంకా ఎలాంటి సమాచారం వెలువడలేదు.
కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో కూడా ఏనుగులు నాలుగు వేర్వేరు సంఘటనల్లో కొందరు వ్యక్తులను తొక్కి చంపాయి. అటవీ ప్రాంతాలలో ఏనుగులు ప్రజలపై దాడి చేసిన అనేక సంఘటనలు. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్‌లో తమిళనాడులోని నీలగిరి జిల్లాలో, ఆగస్టులో ఛత్తీస్‌గఢ్‌లో ఏనుగుల దాడిలో మరణాలు సంభవించాయి. ప్రభుత్వ డేటా ప్రకారం 2020 నుండి ఏనుగుల దాడికి సంబంధించిన సంఘటనల వల్ల కర్ణాటకలో ఐదు మరణాలు సంభవించాయి.