టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కెరీర్‌పై పాకిస్తాన్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన బౌలింగ్‌కు గంభీర్ భయపడేవాడని.. అందువల్లే అతని టీ20, వన్డేల కెరీర్ ముగిసిందని అన్నాడు. 2012లో భారత్- పాకిస్థాన్ మధ్య దైపాక్షిక సిరీస్‌ను గుర్తు చేసుకున్న ఇర్ఫాన్.. గంభీర్ తన బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడేవాడని.. కళ్ళలోకి నేరుగా చూడడానికి భయపడేవాడన్నాడు. ఆ సిరీస్‌లో భాగంగా వన్డేలు, టీ20ల్లో కలిపి నాలుగుసార్లు గంభీర్‌ను ఔట్ చేశాను. ఇక ఆ తర్వాత గంభీర్‌కి జట్టులో అవకాశాలు పెద్దగా రాలేదు. నా కారణంగానే అతని కెరీర్ ముగిసిందనుకుంటున్నానని చెప్పాడు.
నెట్ ప్రాక్టీస్ సమయంలో కూడా తన కళ్లలోకి గంభీర్ చూడలేకపోయేవాడని… ఎవరైనా ఎవరికైనా భయపడినప్పుడు వారి కళ్లలోకి చూడరని, పక్కకు తప్పుకుని వెళ్లిపోతుంటారని ఇర్ఫాన్ తెలిపాడు. ఆ సిరీస్‌లో తన బౌలింగ్‌కు భారత బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడ్డారని… ఈ విషయాన్ని స్వయంగా వారే తనతో చెప్పారన్నాడు. కాగా, ఇర్ఫాన్ కామెంట్స్‌కు నెటిజన్లు గట్టిగా స్పందించారు. ‘గంభీర్ కెరీర్‌ను నువ్వు ముగించావా.? మరి నీ కెరీర్‌ను ఎవరు ముగించారో తెలుసా’ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.