World Athletics Championships: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో స్టీపుల్‌చేజ్ లో చరిత్ర సృష్టించే అవకాశాన్ని అవినాష్ సేబుల్ (Avinash Sable) తృటిలో కోల్పోయాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్‌లో 11వ స్థానంలో నిలిచాడు. తన రేసును 8:31.75 సమయంలో పూర్తి చేశాడు. సౌఫియన్ అల్ 8.25.13తో పూర్తి చేసి స్వర్ణ పతకం దక్కించుకోగా.. గిర్మా 8.26.01తో రజతం, కిప్రుటో 8.27.92తో కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. అవినాష్ సేబుల్ 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్ కూడా ఫైనల్‌కు చేరుకున్నాడు. అప్పుడు 13వ స్థానంలో నిలిచాడు. అవినాష్ సేబుల్ జూన్‌లో డైమండ్ లీగ్‌లో 8.12:48 సమయంతో పూర్తి చేసి జాతీయ రికార్డు సృష్టించాడు. అయితే అదే ప్రదర్శనను.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో పునరావృతం చేయలేకపోయాడు.
అవినాష్ సేబుల్ తన హీట్‌లో 8:18.75 తో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. దీంతో పతకం పై ఆశలు పెంచేశాడు. అయితే అవినాష్ ఫైనల్ లో తన ప్రదర్శనతో అందరినీ నిరాశపరిచాడు. డైమండ్ లీగ్ ట్రాక్‌లో.. జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత రికార్డ్ ను బీట్ చేశాడు. దీంతో ఫైనల్‌కు అర్హత సాధించిన ఆటతీరు చూసి.. అవినాష్ ఈ సారి చరిత్ర సృష్టిస్తాడేమో అని అందరూ అంచానా వేశారు. మరో పతకం పై ఆశలు పెట్టుకున్నారు. 2003లో అంజు బాబీ జార్జ్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
నిరాశపరిచిన మురళీ శ్రీశంకర్
అవినాష్ కంటే ముందు మురళీ శ్రీశంకర్ కూడా నిరాశపరిచాడు. ఫైనల్లో 12 మంది జంపర్లలో శ్రీశంకర్ 7వ స్థానంలో నిలిచాడు. ఫైనల్లో 7.96 మీటర్లు దూకాడు. తన వ్యక్తిగత అత్యుత్తమ స్థాయిని కూడా అందుకోలేకపోయాడు. అయితే పురుషుల లాంగ్ జంప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయుడిగా శ్రీశంకర్ నిలిచాడు. ఇప్పుడు దేశం మొత్తం ఆశలు అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. గత నెలలో జరిగిన స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లో నీరజ్ 89.94 మీటర్ల త్రో విసిరి జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో 19 ఏళ్ల నుంచి పతకం కోసం భారతీయులు ఎదురుచూస్తున్నారు. ఈ ఎదురు చూపులకు నీరజ్ చెక్ పట్టగలదని.. పతాకం తీసుకొస్తాడని నమ్మకం పెట్టుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..