MS Dhoni Cricket Academy: క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు టీమిండియా మాజీ రథసారధి మహేంద్ర సింగ్ ధోని. రిటైర్ అయినప్పటికీ ధోని తన ఆలోచనలతో అందరి హృదయాలను ఆకట్టుకుంటున్నాడు. త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక క్రికెట్ అకాడమీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ పేరుతో అకాడమీని నెలకొల్పబోతున్నాడు. ధోనీకి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థ.. బ్రెయినియాక్స్ బీతో ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే రెండేండ్లలో కనీసం 25 అకాడమీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన ఆటగాళ్లు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పడకుండా.. వారి కెరీర్ ప్రారంభంలోనే అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
రాబోయే రెండేండ్లలో తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కనీసం 20-25 శిక్షణా కేంద్రాలను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో మొదటి అకాడమీ ఈ ఏడాది ఏప్రిల్‌లో కర్ణాటకలోని బళ్లారిలో మొదలుకానుంది. ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ కోచింగ్ డైరెక్టర్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారెల్ కలినన్ కొనసాగనున్నారు. కాగా భారత్‌లో ఇప్పటికే 50కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. విదేశాల్లో మూడింటిని ప్రారంభించారు.
Also Read: