
FIFA World Cup 2026 : లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి మరోసారి తన క్లాస్ ఏంటో ప్రపంచానికి నిరూపించాడు. ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా బుధవారం కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన గ్రూప్-జె మ్యాచ్‌లో అల్జీరియాతో అర్జెంటీనా తలపడింది. ఈ మ్యాచ్‌కు ముందు మెస్సి గాయం కారణంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడా లేదా అనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మేనేజ్‌మెంట్ 38 ఏళ్ల మెస్సిని బరిలోకి దించి మాస్టర్ స్ట్రోక్ ఆడింది. మ్యాచ్ ప్రారంభమైన 17వ నిమిషంలోనే మెస్సి మైండ్ బ్లోయింగ్ గోల్ కొట్టి అర్జెంటీనాకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
కళ్లు చెదిరే వండర్ గోల్
మైదానంలో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ రోడ్రిగో డి పాల్ నుంచి బాక్స్ అంచు వద్ద పాస్ అందుకున్న మెస్సి.. అల్జీరియా గోల్ కీపర్ లూకా జిదాన్‌ను పూర్తిగా బోల్తా కొట్టిస్తూ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. మెస్సి కొట్టిన ఈ రాకెట్ షాట్‌తో స్టేడియం మొత్తం అభిమానుల కేరింతలతో ఊగిపోయింది. నిజానికి మ్యాచ్ ప్రారంభమైన 6వ నిమిషంలోనే మెస్సి ఒక గోల్ కొట్టినప్పటికీ.. అంపైర్ దానిని ఆఫ్‌సైడ్‌గా ప్రకటించడంతో అది రద్దయింది. అయినప్పటికీ పట్టువదలని మెస్సి కొద్దిసేపటికే తన అద్భుత నైపుణ్యంతో అర్జెంటీనాకు తొలి పాయింట్ అందించాడు.
రోనాల్డో ఆల్ టైమ్ రికార్డు సమం
ఈ గోల్‌తో లియోనెల్ మెస్సి తన చిరకాల ప్రత్యర్థి, పోర్చుగల్ లెజెండ్ క్రిస్టియానో రోనాల్డో పేరిట ఉన్న ఒక అరుదైన ప్రపంచ రికార్డును సమం చేశాడు. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే 5 వేర్వేరు ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్లలో గోల్స్ సాధించిన రెండో పురుషుల ఆటగాడిగా మెస్సి రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో రోనాల్డో మొదటి స్థానంలో ఉన్నాడు. దీనితో పాటు పురుషుల ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మెస్సి ఇప్పుడు సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకున్నాడు.
6 వరల్డ్ కప్‌లు ఆడిన ఏకైక మొనగాడు
ఎనిమిది సార్లు ప్రతిష్టాత్మక బాలెన్ డి ఓర్ అవార్డు గెలుచుకున్న మెస్సి.. ఈ మ్యాచ్ ద్వారా ఫుట్‌బాల్ చరిత్రలోనే ఒక సరికొత్త చరిత్రను లిఖించాడు. ప్రపంచంలోనే ఏకంగా 6 వేర్వేరు వరల్డ్ కప్ టోర్నమెంట్లలో ఆడిన మొదటి ఫుట్‌బాల్ ప్లేయర్‌గా మెస్సి సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. కాగా, అతని రికార్డును సమం చేసే అవకాశం క్రిస్టియానో రోనాల్డోకు కూడా ఉంది. గురువారం డిఆర్ కాంగోతో జరగబోయే మ్యాచ్‌లో పోర్చుగల్ తరఫున రోనాల్డో బరిలోకి దిగితే.. అతను కూడా తన కెరీర్‌లో 6వ వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్‌గా మెస్సి సరసన నిలుస్తాడు.
200వ అంతర్జాతీయ మ్యాచ్ మైలురాయి
ఈ మ్యాచ్ లియోనెల్ మెస్సి కెరీర్‌లో మరో అత్యంత అరుదైన రోజుగా నిలిచిపోతుంది. అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున మెస్సికి ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్. ఫుట్‌బాల్ చరిత్రలో తన దేశం తరఫున 200 అంతర్జాతీయ మ్యాచ్‌ల మైలురాయిని అందుకున్న ప్రపంచంలోనే మూడో ఆటగాడిగా మెస్సి నిలిచాడు. ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక క్యాప్స్ (మ్యాచ్‌లు) ఆడిన వారిలో క్రిస్టియానో రోనాల్డో (228 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. బాదర్ అల్-ముతావా (202) రెండో స్థానంలో, లియోనెల్ మెస్సి (200) మూడో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో లూకా మోడ్రిచ్ (198) ఉన్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..