CWG 2022: 2 ఏళ్లకే తండ్రి హత్య.. పోలీస్‌ ఠాణాలో పాఠాలు.. ఈ విజయం వెనక కనిపించని కన్నీళ్లెన్నో!

Commonwealth Games 2022: ఢిల్లీ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ అమృతా మాన్ కుమార్తె తులిక బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించింది. జూడోలో 78 కిలోల కంటే ఎక్కువ బరువున్న విభాగంలో ఆమె రజత పతకాన్ని గెలుచుకుంది.

CWG 2022: 2 ఏళ్లకే తండ్రి హత్య.. పోలీస్‌ ఠాణాలో పాఠాలు.. ఈ విజయం వెనక కనిపించని కన్నీళ్లెన్నో!
Tulika Maan
Basha Shek

|

Aug 05, 2022 | 8:01 AM

Commonwealth Games 2022: ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తారు. కానీ అందరికీ అదృష్టం కలిసిరాదు. ఫలితంగా అనుకున్న గమ్యాన్ని చేరుకోవడం చాలా కష్టమవుతుంది. ప్రయాణంలో అనుకోని అడ్డంకులు ఎదరువుతాయి. కొందరు వాటికి భయపడి మధ్యలోనే తమ లక్ష్యాన్ని విరమించుకుంటారు. మరికొందరు కష్టాలకు ఎదురీది అనుకున్నది సాధిస్తారు. 23 ఏళ్ల తులికామాన్‌ కచ్చితంగా రెండో కోవకే చెందుతారు. కామన్వెల్త్‌-2022 జూడో విభాగంలో రజతంతో మెరిసిన ఈ యంగ్ అథ్లెట్‌ ఎన్నో ఇబ్బందులను అధిగమించి బర్మింగ్‌హామ్‌ దాకా వచ్చింది. ఢిల్లీ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ అమృతా మాన్ కుమార్తె తులిక బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించింది. జూడోలో 78 కిలోల కంటే ఎక్కువ బరువున్న విభాగంలో ఆమె రజత పతకాన్ని గెలుచుకుంది. తద్వారా ఈ ఈవెంట్‌లో భారత్‌ నుంచి పతకం సాధించిన రెండో అథ్లెట్‌గా అరుదైన ఘనత అందుకుంది. అయితే ఈ విజయం అంత సులువుగా రాలేదు. ఆమె కష్టం వెనక ఎన్నో కన్నీళ్లు దాగున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే గత ఏడాది కాలంగా ఆమె సాగించిన పోరాటం అత్యంత స్ఫూర్తిదాయకం.

30 కిలోలు తగ్గి మరీ..

తులికా చిరస్మరణీయ విజయం సాధించిన తర్వాత భారత జూడో జట్టు కోచ్‌ ఈ యంగ్‌ అథ్లెట్‌ కన్నీటి గాథను పంచుకున్నాడు. ‘ ఈ ఈవెంట్‌లో ఏడాది క్రితమే క్రీడాకారుల జాబితాను సిద్ధం చేశాం. అయితే ఫిట్‌గా లేనందున తులికా పేరును అందులో చేర్చలేదు. . ఎందుకంటే అప్పటికి మాన్‌ బరువు 115 కిలోలు. ఎంపిక కాకపోవడం వల్ల తను చాలా నిరాశ చెందింది. ఆట నుంచి నిష్క్రమించాలని కూడా నిర్ణయించుకుంది. అయితే కోచ్‌లు జోక్యం చేసుకుని మాన్‌కు సర్దిజెప్పారు. దీంతో మళ్లీ ఆమె ప్రాక్టీస్‌ ప్రారంభించింది. ఇందుకోసం ఏకంగా 30 కిలోలు తగ్గింది. అర్హత కోసం 85 కిలోలకు చేరుకుంది’ అని కోచ్‌ చెప్పుకొచ్చారు.

తండ్రి మరణం.. రాణాలో పాఠాలు..

అయితే కష్టాలు, కన్నీళ్లు తులికాకు కొత్తవేమీ కాదు. నిరంతరం వాటితోనే సహవాసం చేస్తూ వస్తోంది. ఆమె రెండేళ్ల వయసులో తండ్రి హత్యకు గురయ్యాడు. దీంతో తల్లి అమృతా మాన్ ఆమెకు ఆధారమైంది. ఢిల్లీ పోలీస్‌ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ పనిచేసే అమృత రోజూ తులికను స్కూల్‌లో వదిలిపెట్టి విధులకు వెళ్లేది. ఇక స్కూల్‌ అయిపోయిన తర్వాత నేరుగా పోలీస్‌ స్టేషన్‌కే వెళ్లేది. తల్లి విధులు ముగిసే వరకు అక్కడే చదువుకునేది. ఇలా చిన్నతనంలో పోలీసుల మధ్యనే ఎక్కువగా గడిపింది. అయితే ఈ వాతావరణం నుండి తన కూతురును దూరంగా ఉంచడానికి తులికను జూడో కోచింగ్ క్లాస్‌లో చేర్పించింది అమృత. అలా జూడోపై మక్కువ పెంచుకుంది. ఆతర్వాత శిక్షణ తీసుకుని అంచెలంచెలుగా ఎదిగింది. ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజత పతకం సాధించింది.

‘నేను రజత పతకం కోసం ఇక్కడికి రాలేదు. తదుపరి కామన్వెల్త్‌ లో నా పతకం రంగు మార్చాలి. ఫైనల్‌లో నేను దూకుడు వైఖరిని అవలంబించకుండా రెండు ఫౌల్‌లు చేసాను. తప్పులు సరిదిద్దుకుంటాను. తర్వాతి గేమ్స్‌ లో నా మెడల్‌ రంగు మారుస్తాను’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతోందీ యంగ్‌ అథ్లెట్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu