Cricket History : 50 ఓవర్లలో 822 రన్స్.. 794 పరుగుల తేడాతో విజయం.. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని వింత

Cricket History : సాధారణంగా వన్డే మ్యాచ్‌లో 400 లేదా 500 పరుగులు చేయడమే గగనం అనుకుంటే, ఒక జట్టు ఏకంగా 800 మార్కును దాటేసింది. జింబాబ్వే దేశవాళీ క్రికెట్ లీగ్‌లో చోటుచేసుకున్న ఈ అద్భుతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Cricket History : 50 ఓవర్లలో 822 రన్స్.. 794 పరుగుల తేడాతో విజయం.. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని వింత
Cricket History

Updated on: May 15, 2026 | 7:23 AM

Cricket History : క్రికెట్ అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.. అందుకు తగ్గట్లుగానే ఈ మ్యాచ్‌లో జరిగిన సంఘటనలు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. సాధారణంగా వన్డే మ్యాచ్‌లో 400 లేదా 500 పరుగులు చేయడమే గగనం అనుకుంటే, ఒక జట్టు ఏకంగా 800 మార్కును దాటేసింది. జింబాబ్వే దేశవాళీ క్రికెట్ లీగ్‌లో చోటుచేసుకున్న ఈ అద్భుతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఒక్క టీమ్ మాత్రమే 50 ఓవర్లలో 822 పరుగులు చేయడం క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం.

జింబాబ్వే డొమెస్టిక్ ఫస్ట్ లీగ్ క్రికెట్‌లో భాగంగా స్కోర్పియన్ క్రికెట్ క్లబ్, మీథేన్ లయన్స్ జట్ల మధ్య ఈ చారిత్రాత్మక మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కోర్పియన్ క్లబ్ బ్యాటర్లు మీథేన్ లయన్స్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఏకంగా 822 పరుగులు సాధించారు. ఇందులో టకుంద మడెంబొ అనే బ్యాటర్ 143 బంతుల్లోనే 302 పరుగులు చేసి ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. మరో బ్యాటర్ విన్‌ఫెడ్ మాటెండె కేవలం 75 బంతుల్లోనే 203 పరుగులు చేసి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. గేబ్రియల్ జాయా కూడా 110 పరుగులతో శతక్కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు ఎంతటి విధ్వంసం సృష్టించారంటే.. మొత్తం ఇన్నింగ్స్‌లో 104 ఫోర్లు, 26 సిక్సర్లు బాదారు. అంటే కేవలం బౌండరీల రూపంలోనే 572 పరుగులు రావడం గమనార్హం. మీథేన్ లయన్స్ బౌలర్లు చేతులెత్తేయడమే కాకుండా, ఏకంగా 109 ఎక్స్‌ట్రాలు (19 వైడ్లు, 23 నో బాల్స్) సమర్పించుకుని స్కోర్పియన్ క్లబ్ స్కోరు మరింత పెరగడానికి సహకరించారు. బౌలర్లకు ఇది ఒక పీడకల లాంటి మ్యాచ్ అని చెప్పవచ్చు.

823 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మీథేన్ లయన్స్ జట్టు కనీసం పోరాట పటిమ కూడా చూపలేకపోయింది. స్కోర్పియన్ బౌలర్ల ధాటికి ఆ జట్టు కేవలం 28 పరుగులకే కుప్పకూలింది. దీనితో స్కోర్పియన్ క్రికెట్ క్లబ్ ఏకంగా 794 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఇది ప్రొఫెషనల్ లిస్ట్-ఏ మ్యాచ్ అయి ఉంటే ప్రపంచ రికార్డులన్నీ తిరగరాసేది. ప్రస్తుతం లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక స్కోరు రికార్డు భారత దేశవాళీ జట్టు బీహార్ (574 రన్స్) పేరిట ఉంది.

 

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us