Asia Cup 2023: గుండె బద్దలైంది.. లంక చేతిలో ఓటమితో పాక్‌ డెబ్యూ ప్లేయర్‌ కన్నీళ్లు.. వైరల్‌ వీడియో

|

Sep 15, 2023 | 11:34 AM

ఆసియా కప్ గెలవాలన్న పాకిస్థాన్ కల చెదిరిపోయింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో మరోసారి ఈ జట్టు ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ఆసియా కప్-2023లో భాగంగా గురువారం జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో శ్రీలంక రెండు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్లో భారత్‌తో శ్రీలంక అమీతుమీ తేల్చుకోనుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతికి శ్రీలంక గెలుపొందింది. త్రుటిలో విజయం చేజారిపోవడంతో పాక్ ఆటగాళ్లంతా చాలా బాధపడ్డారు.

Asia Cup 2023: గుండె బద్దలైంది.. లంక చేతిలో ఓటమితో పాక్‌ డెబ్యూ ప్లేయర్‌ కన్నీళ్లు.. వైరల్‌ వీడియో
Sri Lanka Vs Pakistan
Follow us on

ఆసియా కప్ గెలవాలన్న పాకిస్థాన్ కల చెదిరిపోయింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో మరోసారి ఈ జట్టు ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ఆసియా కప్-2023లో భాగంగా గురువారం జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో శ్రీలంక రెండు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్లో భారత్‌తో శ్రీలంక అమీతుమీ తేల్చుకోనుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతికి శ్రీలంక గెలుపొందింది. త్రుటిలో విజయం చేజారిపోవడంతో పాక్ ఆటగాళ్లంతా చాలా బాధపడ్డారు. అయితే ఒక ఆటగాడు మాత్రం ఈ ఓటమిని దిగమింగుకోలేకపోయాడు. మ్యాచ్‌లో పాక్‌ ఓటమి ఖరారు కాగానే మైదానంలో కూలబడిపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను మరెవరో కాదు.. శ్రీలంకతో జరిగినమ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన పాక్‌ ఫాస్ట్ బౌలర్ జమాన్ ఖాన్. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఓవర్లను కుదించి 45 ఓవర్లుగా నిర్ణయించారు. అయితే పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసిన తర్వాత వర్షం రావడంతో అంపైర్లు 42 ఓవర్ల మ్యాచ్‌ని నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో మొదట బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్ 252 పరుగులు చేసింది. వాస్తవానికి ఇక్కడ లంక టార్గెట్‌ 253 రన్స్‌. అయితే డక్‌వర్త్‌ లూయిస్‌ నిబంధనల ప్రకారం లంక లక్ష్యాన్ని 252 గానే నిర్ణయించారు అంపైర్లు. దీనిని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన లంక ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. అయితే మధ్యలో మళ్లీ పాక్‌ బౌలర్లు విజృంభించడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది.

ముఖ్యంగా చివరి ఓవర్‌లో శ్రీలంకకు ఎనిమిది పరుగులు కావాలి. పాక్‌ తరఫున జమాన్‌ఖాన్‌ చివరి ఓవర్‌లో బంతిని తీసుకున్నాడు. మొదటి 4 బంతుల్లో కేవలం 2 పరుగులే ఇచ్చాడు. దీంతో పాక్‌ విజయం సాధిస్తుందనుకున్నారు. అయితే చరిత అసలంక ఐదో బంతికి ఫోర్, ఆఖరి బంతికి రెండు పరుగులు తీయడంతో లంక విజయం సాధించింది. దీంతో జమాన్‌ ఖాన్‌ తీవ్ర నిరాశకు గురయ్యాడు. చేతికొచ్చిన విజయం చేజారిపోవడంతో మైదానంలోనే కూలబడిపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. షాహీన్ షా అఫ్రిదితో సహా పాక్‌ ఆటగాళ్లు జమాన్‌ను ఓదార్చేందుకు ప్రయత్నించారు. ఈ మ్యాచ్‌లో మొత్తం ఆరు ఓవర్లు బౌలింగ్ చేసిన జమాన్‌ 39 పరుగులు ఇచ్చాడు. అయితే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కాగా పాకిస్థాన్ 11 ఏళ్లుగా ఆసియా కప్ టైటిల్ గెలవలేదు. ఈ జట్టు చివరిసారిగా 2012లో ఈ టైటిల్‌ను గెలుచుకుంది. దీని తర్వాత పాకిస్థాన్ మళ్లీ ఈ మెగా ట్రోఫీని అందుకోలేకపోయింది. గతేడాది పాకిస్థాన్ ఫైనల్స్‌కు చేరినా శ్రీలంక చేతిలో ఓడిపోయింది. ఈసారి పాకిస్థాన్‌, భారత్‌తో ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుందని అందరూ భావించారు. అయితే పాక్‌ ఆశలపై శ్రీలంక నీళ్లు చల్లింది.

ఇవి కూడా చదవండి

మైదానంలో పాకిస్తాన్ క్రికెటర్ కన్నీళ్లు.. వైరల్ వీడియో

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..