యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ముంబైని విడిచిపెట్టి తదుపరి డొమెస్టిక్ సీజన్ కోసం గోవాలో చేరడం సంచలనంగా మారింది. అతను గోవాకు ఎందుకు మారడని అభిమానులలో ఇప్పటికీ ఒక ప్రధాన చర్చనీయాంశంగా ఉంది. 25-26 సీజన్ నుండి ఎలైట్ గ్రూప్‌లో పోటీ పడే హక్కులను సంపాదించిన గోవా తరపున ఆడేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి NOC కోసం జైస్వాల్ అభ్యర్థించాడు. గోవా తనకు కెప్టెన్సీ ఆఫర్ చేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని జైస్వాల్ అన్నాడు. “గోవా నాకు కొత్త అవకాశాన్ని ఇచ్చింది, నాకు నాయకత్వ పాత్రను అందించింది.
నా మొదటి లక్ష్యం భారతదేశానికి బాగా రాణించడమే, నేను జాతీయ డ్యూటీలో లేనప్పుడల్లా, గోవా తరపున ఆడుతూ డొమెస్టిక్ టోర్నమెంట్‌లో ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాను” అని జైస్వాల్ పేర్కొన్నాడు. అయితే జైస్వాల్ ముంబై జట్టును వీడేందుకు మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలె రహానెతో జరిగిన గొడవే అందుకు కారణం అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా జైస్వాల్ కెప్టెన్ రహానే కిట్‌ను తన్నాడని సమాచారం. ముంబై కోచ్ ఓంకార్ సాల్వి, కెప్టెన్ రహానే.. జైస్వాల్ నిబద్ధతను ప్రశ్నించడంతో, యువ ఓపెనర్ కోపంగా ఉన్నాడని తెలుస్తోంది. దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్, వెస్ట్ జోన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో, ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌పై పదేపదే స్లెడ్జింగ్ చేసినందుకు జైస్వాల్‌ను కెప్టెన్ రహానే బయటికి పంపించాడు. జైస్వాల్ సౌత్ జోన్ బ్యాట్స్‌మన్ రవితేజను స్లెడ్జింగ్ చేస్తుండగా, అంపైర్ పదే పదే హెచ్చరించినప్పటికీ, జైస్వాల్ ఆగలేదు.
అతను లైన్ దాటుతున్నానని భావించిన రహానే.. జైస్వాల్‌ను గ్రౌండ్ వదిలి బయటికి వెళ్లాలని ఆదేశించాడు. ఈ విషయంలో రహానెపై జైస్వాల్ కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగినట్లు సమాచారం. అలాగే రంజీల్లో ముంబై సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధించినప్పటికీ, విదర్భతో జరిగిన మ్యాచ్ ముందు రోజు జైస్వాల్ జట్టును విడిచిపెట్టి ఇంటికి తిరిగి వెళ్లినట్లు సమాచారం. ముంబై ఓడిపోయిన తర్వాత, చీఫ్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ ఈ విషయమై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ముంబై కెప్టెన్‌తో పాటు ముంబై క్రికెట్ అసోసియేషన్‌తో విభేదాల కారణంగానే జైస్వాల్ ముంబైని వీడి గోవాకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.