AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC ఫైనల్ కోసం టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?

WTC 2029 Final Date: క్రికెట్ అభిమానులకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. 2029 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ తేదీలు ఖరారైనట్లు సమాచారం. ఇంగ్లండ్‌లో జరిగే ఈ ఫైనల్ జూన్ 8 నుంచి 12 వరకు కొనసాగనుంది. మరోవైపు 2030 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి.

WTC ఫైనల్ కోసం టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
Wtc Final
Venkata Chari
|

Updated on: Oct 23, 2026 | 9:29 PM

Share

WTC 2029 Final Date: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (World Test Championship) ఫైనల్‌కు సంబంధించి కీలక నిర్ణయం వెలువడింది. 2029లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌ను జూన్ 8 నుంచి 12 వరకు నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్ణయించినట్లు క్రిక్‌ఇన్ఫో నివేదిక వెల్లడించింది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు ఇంగ్లండ్ మరోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఫైనల్ మ్యాచ్ ఏ మైదానంలో నిర్వహించాలనే నిర్ణయం మాత్రం ఇంకా తీసుకోలేదు.

ఇప్పటివరకు జరిగిన మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు ఇంగ్లండ్‌లోని మూడు వేర్వేరు వేదికలు ఆతిథ్యం ఇచ్చాయి. 2021లో సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్‌లో తొలి ఫైనల్ జరిగింది. 2023లో లండన్‌లోని ది ఓవల్ వేదికగా ఫైనల్ నిర్వహించారు. 2025లో లార్డ్స్‌లో డబ్ల్యూటీసీ టైటిల్ పోరు జరిగింది.

2027 డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇప్పటికే ది ఓవల్‌ను వేదికగా ఖరారు చేశారు. ఆ మ్యాచ్ జూన్ 9 నుంచి 13 వరకు జరగనుంది. 2027, 2029, 2031 డబ్ల్యూటీసీ ఫైనల్స్ నిర్వహించే హక్కులను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) దక్కించుకుంది. దీంతో వరుసగా వచ్చే ఫైనల్స్‌కు ఇంగ్లండ్ ఆతిథ్యం కొనసాగనుంది.

2028 ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో మార్పు

2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు క్రికెట్ క్వాలిఫికేషన్ ప్రక్రియలోనూ మార్పు చేసినట్లు నివేదిక పేర్కొంది. మొదట 2027లో నిర్వహించాలని భావించిన క్వాలిఫయర్స్‌ను 2028 ప్రారంభానికి వాయిదా వేశారు. అంటే LA28 ఒలింపిక్స్ ప్రారంభానికి ఆరు నెలల కంటే తక్కువ సమయంలో క్వాలిఫయింగ్ పోటీలు జరిగే అవకాశం ఉంది.

పురుషుల విభాగంలో డిసెంబర్ 31 నాటికి ICC టీ20 ర్యాంకింగ్స్‌లో అర్హత పొందిన టాప్ జట్లకు సంబంధించి కీలక నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా, యూకే, దక్షిణాఫ్రికా జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించే స్థానాల్లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఆతిథ్య దేశంగా అమెరికాకు ఒక స్థానం దక్కనుంది. చివరి స్థానం కోసం క్వాలిఫయర్ నిర్వహించనున్నారు.

2030 టీ20 వరల్డ్ కప్ ఎప్పుడు?

2030 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌లో కూడా మార్పు చేసినట్లు సమాచారం. తొలుత జూన్‌లో టోర్నీని నిర్వహించాలని భావించినా.. ఇప్పుడు ఈ మెగా ఈవెంట్‌ను జూలై-ఆగస్టు కాలానికి మార్చినట్లు క్రిక్‌ఇన్ఫో నివేదిక తెలిపింది.

ఇదిలా ఉంటే 2028లో జరిగే మహిళల టీ20 వరల్డ్ కప్, పురుషుల టీ20 వరల్డ్ కప్ కూడా వరుసగా నిర్వహించనున్నారు. పాకిస్థాన్‌లో మహిళల టోర్నీ, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లో పురుషుల టోర్నీ జరగనుండగా.. ఈ రెండు ప్రపంచకప్‌ల మధ్య కేవలం 11 రోజుల వ్యవధి మాత్రమే ఉండనుంది.

అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌లో రాబోయే సంవత్సరాలకు సంబంధించి ఐసీసీ తీసుకుంటున్న షెడ్యూల్ నిర్ణయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా WTC ఫైనల్స్, టీ20 వరల్డ్ కప్‌లు, ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ తేదీల్లో వచ్చిన మార్పులు క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Follow Us