వారెవ్వా.. డ్రైవర్ లేకుండానే క్యాబ్ జర్నీ చేయొచ్చు.. ఫోన్‌లో బుక్ చేస్కుంటే నిమిషాల్లోనే..
డ్రైవర్ లేకుండానే మీరు ప్రయాణం చేయొచ్చు. అవును ఉబర్ సరికొత్త టెక్నాలజీ ట్యాక్సీలను ప్రవేశపెట్టింది. ఇప్పటికే వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి వల్ల మరింత వేగంగా ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. అమెరికాలో ప్రస్తుతం ఈ ట్యాక్సీలు అందుబాటులోకి రాాగా.. రానున్న రోజుల్లో విస్తరించనున్నారు. దీంతో ఈ సేవల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

టెక్నాలజీ రాకతో ప్రయాణం మరింత సులువుగా మారింది. జస్ట్ ఫోన్ ఓపెన్ చేసి బైక్, కార్, ఆటో.. ఇలా ఏది కావాలంటే అది ఎంచుకుని బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న కొన్ని నిమిషాల్లోనే మీ ముందుకు క్యాబ్ వచ్చేస్తుంది. దీని ద్వారా మీరు వెళ్లాలనుకున్న ప్రదేశానికి సులువుగా వెళ్లిపోవచ్చు. బస్సులు, మెట్రోలు, ఆటోల కోసం వెయిట్ చేయకుండా ఆన్‌లైన్ క్యాబ్ సర్వీసులు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి. ఈ సర్వీసులు ఆఫీసులకు వెళ్లవారికి బాగా ఉపయోగపడుతున్నాయి. సిటీల్లోనే కాకుండా ప్రస్తుతం పట్టణాలకు కూడా క్యాబ్ సర్వీసులు విస్తరిస్తున్నాయి.
డ్రైవర్ లేకుండానే ప్రయాణం
ఇప్పటివరకు బైక్, కారు, ఆటో ద్వారా గమ్యస్థానానికి చేరుకోవాలంటే రైడర్ ఉండాలి. అంటే డ్రైవర్ ఉండాల్సి ఉంటుంది. కానీ ప్రముఖ ఆన్‌లైన్ క్యాబ్ సర్వీసుల సంస్థ ఉబర్ కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. డ్రైవర్ లేకపోయినా మీరు ప్రయాణం చేయవచ్చు. ఇందుకోససం రోబోటాక్సీ సేవను ఉబర్ ప్రారంభించింది. ప్రస్తుతం అమెరికాలోని లాస్‌వేగాస్‌లో ఈ క్యాబ్ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. సెల్ప్ డ్రైవింగ్ టెక్నాలజీ ద్వారా ఇవి పనిచేస్తాయి. ఈ సేవల కోసం ఇప్పటికే 30కిపైగా కంపెనీలతో ఉబర్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతానికి సెల్ప్ డ్రైవింగ్ సేవలను తమ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, స్నేహితులు కోసం అందుబాటులోకి తీసుకురానుంది. రానున్న రోజుల్లో అందరి కోసం తీసుకురావడంతో పాటు మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశముంది.
ఎలా బుకింగ్ చేసుకోవాలంటే..?
ప్రస్తుతం యాప్ ఓపెన్ చేసి బుకింగ్ చేసుకునే సమయంలో బైక్, కార్, ఆటో లాంటి ఆప్షన్లు కనిపిస్తాయి. అదే తరహాలోనే రోబోటాక్సీల ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఎంపికను సెలక్ట్ చేసుకుని ఈ సెల్ప్ డ్రైవింగ్ టాక్సీ సేవలను ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల డ్రైవర్ లేకుండానే మీరు ప్రయాణం చేయవచ్చు. ఇప్పటికే చాలా దేశాల్లో సెల్ప్ డ్రైవింగ్ కార్లు వచ్చేశాయి. వీటి వినియోగం కూడా పెరిగిపోతోంది. ఇప్పుడు ప్రజల కోసం కూడా క్యాబ్ యాప్స్ ద్వారా ప్రవేశపెడుతున్నారు. అటానమస్ టెక్నాలజీతో ఈ సెల్ప్ డ్రైవింగ్ టాక్సీలు పనిచేస్తాయి. డ్రైవర్ లేకుండానే ప్రయాణికుడిని గమ్యస్థానానికి చేరుస్తాయి. దీని వల్ల ప్రయాణికులు డ్రైవర్ల కోసం వెయిట్ చేయాల్సిన పని తప్పుతుంది. కొన్నిసార్లు డ్రైవర్లు ఆలస్యంగా వస్తుంటారు. ఇలాంటివి తగ్గడం వల్ల ప్రయాణికులు తమ గమ్యస్థానానికి మరింత వేగవంతంగా చేరుకోవచ్చు. యూరప్, మిడిల్ ఈస్ట్ వంటి దేశాల్లో ఇప్పటికే అటానమస్ టెక్నాలజీ వేగంగా అభివృద్ది చెందుతోంది. దీంతో ఆ టెక్నాలజీని అభివృద్ది చేసే సంస్థలతో కలిసి ఉబర్ పనిచేస్తుంది.
