Cyclone Akvan: దిశ మార్చుకున్న అక్వాన్ తుఫాన్.. తెలంగాణపై కూడా తీవ్ర ప్రభావం.. ఆ రోజు నుంచి వర్షాలే..
బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుఫాన్ అక్వాన్ తీరం దిశగా దూసుకొస్తుంది. ఈ నెల 20వ తేదీన తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. దీని తీవ్రత ఎక్కువగా ఉండనుండగా.. ఏపీలో వర్షాలు బీభత్సం సృష్టించనున్నాయి. అయితే దీని ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టం చేసింది.

నిన్న దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలు, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంపై కేంద్రీకృతమై ఉన్న అక్వాన్(Akvan) తుఫాను బలపడి తీవ్ర తుఫానుగా నవంబర్ 18వ తేదీన ఉదయం 05:30 గంటలకు అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. తదుపరి దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంపై ఉన్న ఈ తీవ్ర తుఫాను అక్వాన్.. గత 6 గంటల్లో గంటకు 07 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలి నేడు ఉదయం 08:30 గంటలకు అదే ప్రాంతంలో 12.9° ఉత్తర అక్షాంశం, 85.4° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది చెన్నై (తమిళనాడు)కి తూర్పున సుమారు 570 కి.మీ, విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-ఆగ్నేయంగా 580 కి.మీ, మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్)కి ఆగ్నేయంగా 590 కి.మీ, ట్రింకోమలీ (శ్రీలంక)కి ఈశాన్యంగా 660 కి.మీ, గోపాల్‌పూర్ (ఒడిశా)కి దక్షిణంగా 710 కి.మీ, పూరి (ఒడిశా)కి దక్షిణంగా 770 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ నవంబర్ 20, 2026 మధ్యాహ్నానికి మచిలీపట్నం, పూరి మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీరాలను తీవ్ర తుఫానుగా దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా.
తెలంగాణలో వర్షాలకు ఛాన్స్..
ఈరోజు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలోని ఒకటి రెండు తూర్పు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో పాటు 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. తెలంగాణపై కూడా అక్వాన్ తుఫాన్ ప్రభావం ఉండే అకాశముంది. తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో కూడా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ చెబుతోంది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది.
ఏపీకి తీవ్ర ముప్పు
తీవ్ర తుఫాన్‌గా మారనుండటంతో దీని తీవ్రత ఎక్కువగా ఉండనుంది. దీంతో ఏపీలో అర్నబ్ తరహాలోనే దీని ప్రభావం ఉండనుది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ముందుగానే నష్టనివారణ చర్యలు తీసుకుంటుంది. దీని ప్రభావంతో ఏపీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలకు ఇప్పటికే పలు సూచనలు జారీ చేసింది. తీరప్రాంతాల ప్రజలను అలర్ట్ చేసింది.
