Anushka Sharma : డెబ్యూ మ్యాచ్‌లోనే అనుష్క శర్మ విధ్వంసం..30 బంతుల్లోనే ప్రత్యర్థులకు చుక్కలు

Anushka Sharma : మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ ఆల్‌రౌండర్, మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడింది. కేవలం 30 బంతుల్లోనే 44 పరుగులు సాధించి డెబ్యూ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకుంది. ఇందులో ఏకంగా 7 ఫోర్లు ఉన్నాయి. ఆమె స్ట్రైక్ రేట్ 146.66గా ఉండటం విశేషం.

Anushka Sharma : డెబ్యూ మ్యాచ్‌లోనే అనుష్క శర్మ విధ్వంసం..30 బంతుల్లోనే ప్రత్యర్థులకు చుక్కలు
Anushka Sharma Wpl 2026

Updated on: Jan 10, 2026 | 6:21 PM

Anushka Sharma : మహిళా క్రికెట్ ప్రపంచంలో ఒక కొత్త స్టార్ ఉదయించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో జరిగిన పోరులో గుజరాత్ జెయింట్స్ యువ సంచలనం అనుష్క శర్మ తన బ్యాట్‌తో గర్జించింది. తొలి మ్యాచ్‌లోనే ఏమాత్రం బెదురు లేకుండా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన ఈ 22 ఏళ్ల కుట్టి, స్టేడియాన్ని హోరెత్తించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న యూపీ వారియర్స్ నిర్ణయం తప్పని నిరూపిస్తూ, గుజరాత్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ముఖ్యంగా అనుష్క శర్మ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ ఆల్‌రౌండర్, మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడింది. కేవలం 30 బంతుల్లోనే 44 పరుగులు సాధించి డెబ్యూ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకుంది. ఇందులో ఏకంగా 7 ఫోర్లు ఉన్నాయి. ఆమె స్ట్రైక్ రేట్ 146.66గా ఉండటం విశేషం. స్టార్ ప్లేయర్ యాష్ గార్డనర్‌తో కలిసి మూడో వికెట్‌కు ఏకంగా 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, గుజరాత్ జట్టు స్కోరును 200 దాటించడంలో కీలక పాత్ర పోషించింది. అనుష్క మెరుపు ఇన్నింగ్స్ పుణ్యమా అని గుజరాత్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 207 పరుగుల భారీ స్కోరు సాధించింది.

మెగా వేలంలో అనుష్క శర్మ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరికి 45 లక్షల రూపాయలకు గుజరాత్ జెయింట్స్ ఆమెను సొంతం చేసుకుంది. తన బేస్ ప్రైస్ కంటే 4.5 రెట్లు ఎక్కువ ధర పలికిన అనుష్క, తనపై యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని మొదటి మ్యాచ్‌లోనే నిలబెట్టుకుంది. అండర్-19 లెవల్ నుంచే తన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె, ఇప్పుడు పెద్దల లీగ్‌లోనూ తన సత్తా చాటుతోంది.

అనుష్క శర్మ కేవలం డబ్ల్యూపీఎల్‌లో మాత్రమే కాదు.. దేశవాళీ క్రికెట్‌లోనూ అదరగొడుతోంది. ఇటీవల జరిగిన సీనియర్ మహిళల ఇంటర్ జోనల్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ తరపున ఆడి 155 పరుగులు చేయడమే కాకుండా 7 వికెట్లు కూడా పడగొట్టింది. అలాగే సీనియర్ టీ20 ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపున 207 పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిలో పడింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించగల సామర్థ్యం ఉండటంతో ఆమె భారత మహిళా జట్టులోనూ త్వరలోనే చోటు దక్కించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..