World Record : భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్.. ప్రపంచంలోనే మొదటి బ్యాటర్ గా రికార్డ్!
Daryl Mitchell : న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ భారత గడ్డపై పరుగుల వరద పారిస్తున్నాడు. ఇండోర్‌లో జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో మిచెల్ మరోసారి సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం హాఫ్ సెంచరీతో సరిపెట్టుకోకుండా, టీమిండియా బౌలర్లను విసిగిస్తూ 106 బంతుల్లో తన అద్భుత సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రపంచ క్రికెట్‌లో మరే విదేశీ బ్యాటర్‌కూ సాధ్యం కాని రీతిలో భారత్‌పై ఒక చారిత్రాత్మక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

World Record : భారత దేశంలో టీమిండియా పై వన్డేల్లో ఆడుతున్నప్పుడు ఏ బ్యాటర్ కైనా ఒత్తిడి ఉంటుంది. కానీ డారిల్ మిచెల్ మాత్రం ఇక్కడ ఆడుతుంటే తన సొంత ఊరిలో గల్లీ క్రికెట్ ఆడుతున్నంత ఈజీగా రెచ్చిపోతున్నాడు. ఇండోర్ వన్డేలో సెంచరీ పూర్తి చేసిన మిచెల్.. భారత దేశంలో టీమ్ ఇండియాపై వరుసగా ఐదు వన్డే ఇన్నింగ్స్‌ల్లో 50కి పైగా పరుగులు చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ అరుదైన ఘనత ఇప్పటివరకు క్రికెట్ దిగ్గజాలుగా పేరున్న సచిన్, కోహ్లీ లాంటి వారు ఆడే వేదికలపై ఏ విదేశీ బ్యాటర్ కు కూడా సాధ్యపడలేదు. మిచెల్ పరుగుల దాహం 2023 వన్డే వరల్డ్ కప్ నుంచి మొదలైంది. అప్పుడు లీగ్ మ్యాచ్‌లో భారత్‌పై 130 పరుగులు చేసిన మిచెల్, వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీఫైనల్‌లో కూడా 134 పరుగులతో విరుచుకుపడ్డాడు. ఇక ప్రస్తుత సిరీస్‌లో కూడా అదే భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వడోదరలో జరిగిన తొలి వన్డేలో 84 పరుగులు, రెండో వన్డేలో అజేయంగా 131 పరుగులు, ఇప్పుడు ఇండోర్‌లో కూడా 106 బంతుల్లో సెంచరీ బాది తన రికార్డును పదిలం చేసుకున్నాడు. వరుసగా 130, 134, 84, 131, 100+.. ఇవీ భారత గడ్డపై మిచెల్ చివరి ఐదు ఇన్నింగ్స్‌ల గణాంకాలు.. ఇదొక నమ్మశక్యం కాని రికార్డు.
న్యూజిలాండ్ దిగ్గజం కేన్ విలియమ్సన్ 2014లో భారత్‌పై వరుసగా ఐదు 50+ స్కోర్లు చేసినప్పటికీ, అవి వేర్వేరు దేశాల్లో జరిగాయి. కానీ భారత్‌లోనే.. భారత బౌలర్లపై వరుసగా ఐదుసార్లు 50 మార్కును దాటిన రికార్డు మాత్రం కేవలం మిచెల్‌కు మాత్రమే దక్కింది. ఓవరాల్‌గా భారత్‌తో జరిగిన చివరి ఏడు వన్డేల్లో మిచెల్ ఏకంగా మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు సాధించడం అతని క్లాస్ బ్యాటింగుకు నిదర్శనం. స్పిన్నర్లను స్వీప్ షాట్లతో భయపెట్టడం, పేసర్లను స్టేడియం వెలుపలికి పంపడం మిచెల్‌కు అలవాటుగా మారిపోయింది.
వచ్చే టీ20 వరల్డ్ కప్ 2026కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో, మిచెల్ ఇలాంటి ఫామ్‌లో ఉండటం భారత మేనేజ్‌మెంట్‌కు పెద్ద ఆందోళనే. పీడకలలా వెంటాడుతున్న మిచెల్ వికెట్ తీయడం భారత బౌలర్లకు ఒక అగ్ని పరీక్షలా మారింది. మిచెల్ ఇన్నింగ్స్ వల్ల కివీస్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడల్లా కొండలా నిలబడి ఆదుకుంటున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే.. మిచెల్ ఇప్పుడు కివీస్ జట్టుకు ఒక సూపర్ హీరోలా మారి, భారత బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.
